– మమతా మీటింగ్ కి ఎందుకు వెళ్లలేదు?
– నిజంగా బీజేపీ అంటే కేసీఆర్ కు పడకపోతే..
– రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టాలి?
– లేదంటే.. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని తేలిపోతుంది
– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రేవంత్ విసుర్లు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈడీ విచారణపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నారు. అక్రమ కేసులతో కేంద్రం కావాలనే ఇబ్బందులకు గురి చేస్తోందని తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం దేశవ్యాప్తంగా రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో జరగబోయే నిరసన కార్యక్రమానికి సంబంధించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వివరించారు. గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. మోడీ, ఈడీపై మండిపడ్డారు. ఖైరతాబాద్ నుంచి రాజ్ భవన్ వరకు ర్యాలీ ఉంటుందని.. దీనికి కాంగ్రెస్ శ్రేణులు తరలి రావాలని పిలుపునిచ్చారు.
బీజేపీ అనుబంధ సంస్థగా ఈడీ మారిందని.. రాహుల్, సోనియా గాంధీలకు నోటీసులు ఇచ్చిందని ఆరోపించారు. అర్ధరాత్రి వరకు విచారణ పేరుతో వేధిస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తే, పోలీసులు దారుణంగా దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. ఏఐసీసీ కార్యాలయంలోకి కూడా పోలీసులు వెళ్లారని.. గాంధీ కుటుంబంపై రాజకీయ కక్ష సాధింపులకు బలి చేయాలని బీజేపీ, కేంద్ర ప్రభుత్వం చూస్తోంది ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చామని వివరించారు.
గురువారం ఉదయం 10 గంటలకు పీజేఆర్ విగ్రహం వద్దకు కాంగ్రెస్ శ్రేణులు అంతా చేరుకోవాలన్నారు రేవంత్. అక్కడి నుంచి ర్యాలీగా రాజ్ భవన్ కు వెళ్తామని చెప్పారు. అలాగే జిల్లాలలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు నిరసన తెలపాలని పార్టీ నేతలకు సూచించారు. ఇక.. కేసీఆర్ గురించి మాట్లాడుతూ.. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి పరోక్షంగా సహకరిస్తారని ఆరోపించారు. రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండి బీజేపీకి సాయం చేస్తారని పేర్కొన్నారు. కలిసి పనిచేద్దామన్న కేసీఆర్.. మమతా బెనర్జీ నిర్వహించిన సమావేశానికి ఎందుకు వెళ్లలేదని నిలదీశారు.
బీజేపీకి కేసీఆర్ వ్యతిరేకమైతే రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెడతారా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే.. వెయ్యి మంది కేసీఆర్ లు వచ్చినా వచ్చేది కాదని అన్నారు. సోనియాకి జరిగిన అవమానం అంటే.. దేశ ప్రజల మీద, సంస్కృతి మీద దాడి చేసినట్టే అని అభివర్ణించారు.