ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణితో అన్నీ తలనొప్పులే. దాని పనితీరు చూసి కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఉడిపోయిన చందంగా ఉందనే విమర్శలు ఉన్నాయి. తరతరాలుగా భూ వివాదాలతో సతమతమవుతున్న రాష్ట్ర రైతుల పాత సమస్యలు ధరణి పరిష్కరించక పోగా కొత్తవి తెచ్చి పెట్టిందని ప్రతిపక్షాలు తరచూ ఆరోపణలు చేస్తున్నాయి. తాజాగా మరోసారి ఇదే విషయాన్ని గుర్తు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
ధరణి పోర్టల్ కొత్త సమస్యలకు నెలవుగా మారిందని విమర్శలు చేశారు రేవంత్. నిర్వహణా లోపమా? లేదా భారీ భూ కుంభకోణమా? తేలాల్సిన అవసరం ఉందన్నారు.
రేవంత్ చేసిన ట్వీట్
“నిముషాల వ్యవధిలో భూముల రిజిస్ట్రేషన్ అని ఆర్భాటంగా ప్రకటించిన ధరణి… కొత్త సమస్యలకు నెలవుగా మారింది. భూమే ప్రాణంగా బతికే రైతు ఆ భూ హక్కు కోసం నెలల తరబడి అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సిన దుస్థితి వచ్చింది. ఇది నిర్వహణా లోపమా! భారీ భూ కుంభకోణమా? తేలాల్సిన అవసరం ఉంది”
రాష్ట్రంలోని రైతులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలలో ప్రతీ సోమవారం ప్రజావాణిలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతీ రోజు దాదాపు 90 శాతం మంది రైతులు ధరణి ద్వారా ఏర్పడ్డ సమస్యలు పరిష్కారం చేయాలని కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తున్నారు. కానీ.. సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందని అంటున్నారు రైతులు. వారి బాధను అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ట్విట్టర్ లో ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.