– కేంద్రంపై యుద్ధమన్నారు..
– తెలంగాణను మోడీ అవమానించినా నో రియాక్షన్!
– యుద్ధమంటే ఇదేనా సారూ?
– నిరసన కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనలేదు
– కేసీఆర్ ను ప్రశ్నించిన రేవంత్
తెలంగాణ అస్థిత్వాన్ని ప్రశ్నించిన మోడీని నిలదీయడానికి కేసీఆర్ కు అంత భయమెందుకని ప్రశ్నించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. అమరవీరుల త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రాన్ని అవమానిస్తుంటే నికార్సైన తెలంగాణ బిడ్డ ఎవరైనా పౌరుషంతో తిరగబడతారని అన్నారు. జనగామ ప్రసంగం తర్వాత ‘కేసీఆర్ ఖేల్ ఖతం’ అన్న విషయం అర్థమైందన్నారు. బైబై కేసీఆర్ అనే హాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో ప్రశ్నించారు.
ఇక శుక్రవారం మీడియాతో మాట్లాడిన రేవంత్.. కేసీఆర్ కుటుంబంలోని ఐదుగురు మోడీకి దళారులుగా మారారని విమర్శలు చేశారు. వాళ్ల తీరు చూస్తుంటే.. మోడీకి బానిసలుగా తయారయినట్లు కనిపిస్తోందని ఆరోపించారు. పార్లమెంట్ సాక్షిగా ప్రధాని అత్యంత దిగజారి తెలంగాణ ఏర్పాటును అవమానిస్తే.. సభలో టీఆర్ఎస్ ఎంపీలు కనీసం అడ్డు తగల్లేదని గుర్తు చేశారు. మోడీ ప్రసంగానికి నిరసన తెలుపుతూ వాకౌట్ చేసినవారికి కూడా మద్దతు తెలుపలేదన్నారు. మోడీ ప్రసంగంపై కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
కేంద్రంపై యుద్ధం ప్రకటించామన్న సీఎం ఏం చేస్తున్నారని నిలదీశారు. తెలంగాణ ఏర్పాటును అవమానిస్తే కనీసం ఖండించారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు మోడీ దిష్టిబొమ్మ తగులబెట్టే కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. ఇక తెలంగాణ ద్రోహులు ఇవాళ హక్కుల గురించి మాట్లాడుతున్నారంటూ చురకలంటించారు. టీఆర్ఎస్ నేతలు నిరసన కార్యక్రమాలకు రేబాన్ కళ్ళద్దాలు పెట్టుకొని వచ్చారన్నారు.
పోలీసులు అక్రమ నిర్బంధాలకు పాల్పడున్నారన్న రేవంత్.. టీఆర్ఎస్ ప్రభుత్వం మారాక వారిని ఎవరూ కాపాడలేరని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించిన బీజేపీకి ప్రజల ఓట్లు కావాలా? అంటూ మండిపడ్డారు. ప్రధాని క్షమాపణ చెప్పకుండా రాష్ట్రానికి వస్తే అడుగు పెట్టనివ్వమని హెచ్చరించారు. తెలంగాణ బిల్లు పాస్ అయ్యేటప్పుడు కేసీఆర్ సభలో లేరని ఈ సందర్భంగా గుర్తు చేశారు రేవంత్. ముమ్మాటికీ రాష్ట్రాన్ని సోనియాగాంధీనే ఇచ్చారని.. ప్రజలందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణను అవమానించిన బీజేపీకి రాష్ట్ర ప్రజల ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని అన్నారు రేవంత్.