సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్లపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమని అన్నారు. మోడీ ప్రభుత్వం ఆర్మీ విద్యార్థుల మనోభావాలకు భిన్నంగా తీసుకున్న నిర్ణయ ఫలితం ఇదని చెప్పారు. దేశభక్తితో సైన్యంలో చేరడానికి సిద్ధపడిన యువత ఇంతలా ఆందోళనకు దిగారంటే ‘అగ్నిపథ్’ సరైంది కాదన్నారు. ప్రభుత్వం పాత విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు రేవంత్.
ఇటు ఈ ఘటనపై తమకు ఎలాంటి సంబంధం లేదని ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ అన్నారు. ఈ విధ్వంసానికి ఎన్ఎస్ యూఐ కారణమని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. అగ్నిపథ్ పరీక్ష రద్దు కావడం వల్ల గత 48 గంటల్లో చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడం జరిగిందని చెప్పారు. ఆ విద్యార్థులు ఆవేశానికిలోనై ఈ ఘటనకు పాల్పడడం జరిగిందని తెలిపారు. ఈ ఘటనకు ఎన్ఎస్ యూఐకి ఎలాంటి సంబంధం లేదని.. ఆ వార్తలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.
మరోవైపు ఇతర రైల్వే స్టేషన్లలోనూ భద్రత పెంచారు పోలీసులు. కాచిగూడ రైల్వే స్టేషన్ లో రాకపోకలు నిలిపివేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు. ముందస్తుగా పోలీస్ బందోబస్తు ఉంచారు.
నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద భద్రత పెంచారు. కేంద్రం ఆదేశాల మేరకు అన్ని రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. నాంపల్లి రైల్వే స్టేషన్ మెయిన్ గేట్ తో పాటు ప్లాట్ ఫాంపై పోలీసులు పహారా కాస్తున్నారు. ఇటు మలక్ పేట రైల్వే స్టేషన్ ను మూసివేశారు.