(అనుమల రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ)
తెలంగాణ ప్రభుత్వ పెద్దలు కాళేశ్వరం ప్రాజెక్టు ముసుగులో రూ.40 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ బీజేపీ నేత నడ్డా ఆరోపిస్తున్నారు. నేను సూటిగా అడుగుతున్నాను.. అవినీతికి పాల్పడ్డారంటూ అధికారంలో వున్న మీరు చెబుతున్నారు.. మీ చేతిలో పెన్నుంది.. మీ చేతిలో అధికారం వుంది.. మీరెందుకు కాళేశ్వరం అవినీతి మీద సీబీఐ విచారణకు ఆదేశించడం లేదు.? మీరు ఏదో గాల్లో రాయి విసిరినట్టు కూడా మాట్లాడలేదు.. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి పెద్దఎత్తున జరిగిందని.. కేసీఆర్ దోచుకున్నాడని బహిరంగంగా, ప్రజల ముందర మీరన్నారు. అలాంటప్పుడు సెంట్రల్ విజిలెన్స్ విచారణ కానీ, సీబీఐ విచారణ కానీ జరిపించి ఎంత అవినీతి జరిగిందో నిగ్గు తేల్చడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆదేశాలు ఇవ్వడం లేదు? మీకున్న లాలూచీ ఏంటి? విద్యుత్ శాఖలో కూడా పెద్దఎత్తున దోపిడీకి పాల్పడ్డారని లక్ష్మణ్ గారు అంటున్నారు. యస్.. ఐదు సంవత్సరాల నుంచి నేను ఏవైతే వివరాలు, ఆధారాలతో సహా బయటపెడుతున్నానో అవే ఆరోపణల గురించి లక్ష్మణ్ ఇప్పుడు చెబుతున్నారు. చంద్రశేఖరరావు అంతర్గత లావాదేవీలు.. అవినీతి గురించి నేను ఆనాడే చెప్పినా ఇంతవరకు వాటిపై ఎంక్వయిరీకి ఆదేశించలేదు…ఇప్పుడైనా నడ్డా గారు మాటలకే పరిమితం కాకుండా ఇక్కడ జరుగుతున్న అవినీతి మీద వెంటనే ఎంక్వయిరీ జరిపిస్తారని ఆశిస్తున్నాను.