ఒక్కసారి ఎమ్మెల్యే అయినా సరే.. ఎప్పటికైనా సీఎం కూడా కావాలని కలలు కనేవారు రాజకీయాల్లో కోకొల్లలుగా ఉంటారు. కనీసం మంత్రి పదవి దక్కినా తమ జీవితం ధన్యం అయినట్టే భావించేవారు అందులో ఎంతో మంది. అయితే ఆ ఆదృష్టం,అవకాశం అందరికీ రావు. కానీ తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేసులో మొదటి వరుసలో ఉండి కూడా ఇద్దరు నేతలు ఆ పదవి తమకు అవసరం లేదని ఓపెన్గా చెప్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వారు నిజంగానే అలా చెబుతున్నారా లేక.. అందులోనూ స్ట్రాటజీ ఉందా అన్నది ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. తమకు సీఎం పదవి అక్కర్లేదని ఇప్పటి నుంచే ప్రకటనలు చేస్తూ హాట్ టాపిక్గా మారుతున్నారు. సీఎం ఎవరైనా పరవాలేదని చెబుతూ కొత్త చర్చకు తావిస్తున్నారు. అయితే వారు అలా మాట్లాడటం వెనుక పెద్ద స్ట్రాటజీనే ఉందని అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం అటు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి, ఇటు బీజేపీలో బండి సంజయ్ నాయకత్వం పట్ల ఆయా పార్టీల్లోనే కొందరు నేతలు చాలా అసూయగా ఉన్నారు. వారి రాకతో పార్టీలో కొత్త జోష్ రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఊపు చూస్తోంటే అదృష్టవశాత్తు నిజంగానే తమ పార్టీలకు అధికారంలోకి తీసుకొస్తారేమోనన్న అంచనాలు కూడా కొందరిలో ఉన్నాయి. దీంతో అలాంటి వారు ఇప్పటి నుంచే వారి కాళ్లల్లో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
సీనియర్ల వ్యవహారాన్ని గమనిస్తున్న బండి, రేవంత్ ఇద్దరూ కూడా ఏం చేయలేకపోతున్నారు. తమకు సీఎం పదవి వస్తుందన్న భయంతోనే వారు అలా చేస్తున్నారన్న భావనకు వారు వచ్చారు. దీంతో సీనియర్ల ఇగోను సాటిస్ఫై చేయాలంటే తాత్కాలికంగా సీఎం పదవిని త్యాగం చేయాల్సిందేనని వారు ఫిక్సయినట్టుగా కనిపిస్తోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందుకే అవకాశం వచ్చినప్పుడల్లా తాము సీఎం కావాలని అనుకోవడం లేదని చెప్తూ.. సీనియర్ల నుంచి ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికల కోసం ఎంతో కష్టపడిన వారిని కాదని.. అధిష్టానాలు ఎవరికో సీఎం అప్పగించే అవకాశం లేదని తెలిసే.. వారు ఇలా తెలివిగా మాట్లాడుతున్నారని వివరిస్తున్నారు.