తెలంగాణ కాంగ్రెస్ నేతలు డీజీపీ అంజనీ కుమార్ ను కలిశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా దాడిని డీజీపి దృష్టికి తీసుకువెళ్లారు. మార్కండేయ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన తమ పార్టీ శ్రేణులపై దాడులు జరిగాయని తెలిపారు. ఎన్నికల సమయంలో సాగునీటి ప్రాజెక్టుని కేసీఆర్ ప్రకటించారని అన్నారు రేవంత్.
కానీ, ఏండ్లు గడుస్తున్నప్పటికీ ప్రాజెక్టు ముందుకు కదలడం లేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆ ప్రాజెక్టు శిలాఫలకాన్ని సందర్శించి, ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రజలకు వివరించాలని తమ పార్టీ శ్రేణులు అనుకున్నారన్నారు. తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నాగం జనార్దన్ రెడ్డి అక్కడ పర్యటించారని వెల్లడించారు.
కానీ, తమ నేతపై టీఆర్ఎస్ నాయకులు దూషణకు దిగారని, ఆయన వెంట వచ్చిన ఆ ప్రాంత ప్రజలపై దాడులు కూడా చేశారని వివరించారు. ఒకరి గొంతు మీద కాలేసి టీఆర్ఎస్ నేతలు తొక్కారని, మరొకరిని కొట్టారని, తీవ్ర పదజాలంతో దూషించారని తెలిపారు. బాధితుల్లో గిరిజనుడు, దళితుడు ఉన్నారని చెప్పారు. గొంతు మీద కాలేసి తొక్కినందుకు హత్యాయత్నం కేసు, దూషించినందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
కానీ, పోలీసులు చర్యలు తీసుకోవాల్సింది పోయి అక్కడికి వచ్చిన నాగం జనార్దన్ రెడ్డి వంటి నేతలపై కేసులు పెట్టారని మండిపడ్డారు. మహిళా సర్పంచ్ ను అవమానించారంటూ నాగంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ఇది ప్రభుత్వ, పోలీసుల బరితెగింపు చర్యకు నిదర్శనమన్నారు. అలాంటి చర్యలకు పాల్పడిన స్థానిక పోలీసులపై.. అక్కడికి వచ్చి దాడులు చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్టు వెల్లడించారు రేవంత్ రెడ్డి.