నిజాం పాలనలో కొన్ని తప్పులు జరిగినా.. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అయితే.. ఆ తప్పులను కాంగ్రెస్ సమర్థించదని అన్నారు. ఈమధ్యే మరణించిన చివరి నిజాం ముకర్రమ్ ఝా కు ఆయన నివాళులర్పించారు. ముకర్రమ్ అంత్యక్రియలను ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించడాన్ని స్వాగతించారు. ఈ నిర్ణయాన్ని తప్పుబట్టేవారికి మానసిక వైకల్యం ఉండి ఉంటుందన్నారు.
ఇప్పుడున్న రాజకీయ నాయకులు కేవలం 5, 10 సంవత్సరాలు మాత్రమే పాలన చేసి అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని, నిజాం నవాబులు హైదరాబాద్ సంస్థానాన్ని 220 సంవత్సరాలు పాలించి అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేశారని చెప్పారు. వ్యవసాయం, విద్య, వైద్యం, ఉపాధి కోసం ఎన్నో ప్రాజెక్టులు, ఉస్మానియా యూనివర్సిటీలు, పరిశ్రమలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.
నిజాంల సంపదను కేసీఆర్ ప్రభుత్వం అమ్ముకుంటోందని ఆరోపించారు రేవంత్. అందరూ గర్వించే ఓ గొప్ప పనికి ప్రభుత్వం చివరి నిజాం పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎలాంటి కార్యక్రమం చేపట్టాలనే అంశంపై ప్రభుత్వం అసెంబ్లీలో అందరితో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
పాతబస్తీలో ఉన్న చౌమహల్లా ప్యాలెస్ ముకర్రమ్ ఝా పార్థివదేహాన్ని ఉంచారు. రేవంత్ వెంట షబ్బీర్ అలీ, ఫెరోజ్ ఖాన్, సమీర్ వలీ ఉల్లా, ఉజ్మా షకీర్ సహా పలువురు నేతలు ఉన్నారు.