పవన్‌కల్యాణ్, రేవంత్ రెడ్డి.. ఇద్దరూ ఓ రేంజ్ ఫాన్ ఫాలోయింగ్ వున్న బిగ్ లీడర్లు. ఇప్పటి వరకు వీరి దారులు, పంథా వేరే అయినా, సేవ్ నల్లమల ఉద్యమం ఈ ఇద్దర్నీ కలిపింది. రెండు రాష్ట్రాల్లోను ప్రజాదరణ కలిగిన నేతలు కావటం, తెలంగాణకు సంబంధించినదే అయినా ఇందులో రెండు రాష్ట్రాల ప్రయోజనాలతో కూడిన అంశం కావటంతో అందరి ఆసక్తి ఇప్పుడు ఈ కాంబినేషన్ పైనే ఉంది.
1000 టీఎంసీల కృష్ణా నదీ పరివాహక ప్రాంతం, కోట్లాది మంది ఆధారపడ్డ మంచినీరు, జన జీవన మనుగడను ప్రశిస్తున్న యురేనియం తవ్వకాలపై కేసీఆర్, కేటీఆర్ అండ్ టీమ్ ఆడుతున్న మైండ్ గేమ్‌పై పవన్-రేవంత్ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమయ్యారు. రేవంత్ రెడ్డి–పవన్ కలిసి ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి సిద్దం కావటం తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు కానుంది. ఇన్నాళ్లూ ఎదురులేని కేసీఆర్, టీఆరెస్‌కు ఇప్పుడీ కలయిక కచ్చితంగా మైనస్ అవ్వబోతుంది.
పవన్-రేవంత్ పోరాటం తెలంగాణ వరకు కాంగ్రెస్‌కు బూస్ట్ ఇవ్వనుంది. కేసీఆర్ వేస్తున్న వ్యూహాలను అర్థం చేసుకొని, ప్రతిఘటించే సన్నద్దత కొరవడిన నేపథ్యంలో కాంగ్రెస్‌కు ఇదో మంచి అవకాశం అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. యురేనియం తవ్వకాల అంశం, పవన్-రేవంత్ క్రేజీ కాంబినేషన్‌ను కాంగ్రెస్ రెండు చేతులా అందిపుచ్చుకోగలిగితే, టీఆరెస్‌కు కష్టాలు మొదలైనట్లే. ఓవైపు బీజేపీ తెలంగాణపై దృష్టి సారించిన నేపథ్యంలో రెండు పార్టీలనూ ఇరుకున పెట్టె సదవకాశమని భావిస్తున్నారు. చివరి నిమిషంలో సెల్ఫ్ గోల్ చేసుకుంటూ ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చే అలవాటున్న కాంగ్రెస్ ఈ అవకాశాన్ని ఎలా వాడుకుంటుందో చూడాలి.