బీజేపీ, టీఆర్ఎస్ నేతలు తోడు దొంగల్లా తయారయ్యారని విమర్శించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కొడంగల్ లోని గాంధీ నగర్ లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారాయన. తర్వాత తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు జరగక రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు రేవంత్. ఈ పాపం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని విమర్శించారు.
పార్లమెంట్ లో టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడిందని ఆరోపించారు రేవంత్. గులాబీ ఎంపీలు సభలో ఉండి పోరాడాలి గానీ.. బయటకు రావడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఏదో తూతూ మంత్రంంగా నిరసన తెలిపి బాయ్ కాట్ చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో సాగు చేసిన పంటను అమ్ముకోలేక అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు రేవంత్.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్న ఆయన.. టీఆర్ఎస్ ఎంపీలు దేశంలోని ప్రధాన ప్రతిపక్ష నేతలతో చర్చించి వరిసాగు విషయంలో అందర్నీ ఏకం చేసి కేంద్రంపై ఒత్తిడి చేయాలని సూచించారు. అలా కాకుండా వాకౌట్ చేయడం ఏంటని నిలదీశారు రేవంత్.