317 జీవోపై బీజేపీ, టీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆయన సమక్షంలో ఉపాధ్యాయుల సంఘం మాజీ నేత హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. కేసీఆర్, బండి సంజయ్ పై మండిపడ్డారు. అధికారం ఇస్తే 317 జీవో రద్దు చేయిస్తామని బండి సంజయ్ అంటున్నారు.. కేంద్రంలో ఉన్నది ఎవరని ప్రశ్నించారు. రాష్టప్రతిని కలిసి 317 జీవోను బీజేపీ నేతలు ఎందుకు రద్దు చేయించడం లేదని నిలదీశారు.
ఉద్యోగ, ఉపాధ్యాయులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు రేవంత్. త్వరలోనే ప్రత్యక్ష కార్యాచరణ తీసుకుంటామని తెలిపారు. బడిలో పాఠాలు చెప్పాల్సిన టీచర్లు ప్రగతి భవన్ ముట్టడి చేస్తున్నారని.. సంఘాల నేతలు కేసీఆర్ కు లొంగిపోయినా కాంగ్రెస్ మాత్రం కచ్చితంగా అండగా ఉంటుందని చెప్పారు.
317 జీవో పేరుతో భార్యా భర్తలను విడగొట్టి కేసీఆర్ రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు రేవంత్. కొన్ని సంఘాలను తనకు అనుకూలంగా మార్చుకుని రాజకీయ కుట్రకు తెరలేపారని మండిపడ్డారు.
తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందన్న రేవంత్.. బదిలీల పేరుతో భార్యాభర్తలను విడగొట్టి వారి పిల్లలకు స్థానికత లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు అండగా ఉండి కాంగ్రెస్ పోరాటం చేస్తుందని భరోసానిచ్చారు.