పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి పేరు ఖరారైపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షుల మార్పు ఉంటుందని అంతా భావించారు. ఓకేసారి తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ నూతన సారథుల నియామకం ఉంటుందని అంచనా వేశారు. కానీ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కారణంగా పార్టీలో గందరగోళం ఉండకూడదన్న కారణంతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరు అధికారిక ప్రకటన వాయిదా పడగా… ఏపీ పీసీసీ చీఫ్‌గా మాజీ మంత్రి శైలజానాథ్ పేరును ఏఐసీసీ ప్రకటించింది.
తెలంగాణ పీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇప్పటికే తనను తప్పించాలంటూ కాంగ్రెస్ పెద్దలకు విన్నవించుకున్నారు. ఎంపీగా గెలిచినా… అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాభవం, తాను రాజీనామా చేసిన సీటు ఉప ఎన్నికలోనూ ఓడిపోవటంతో ఆయన రాజీనామకు సిద్దపడ్డారు. కానీ అంతలోనే మున్సిపల్ ఎన్నికలు రావటంతో ఉత్తమ్ ఎగ్జిట్ వాయిదాపడుతూ వచ్చింది.
జనవరి 24న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. కొత్త చైర్మన్లు, మేయర్ల ఎన్నికలు జరిగిన తర్వాత తెలంగాణ పీసీసీ చీఫ్ ప్రకటన ఉండే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. ఫిబ్రవరి మొదటి వారంలో పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించబోతున్నట్లు రేవంత్ రెడ్డి సన్నిహిత వర్గాల సమాచారం.
పీసీసీ చీఫ్ రేసులో ఎంపీ కోమటిరెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డిలు ఉన్నప్పటికీ… సీఎం కేసీఆర్‌ను, ఆయన వాగ్ధాటిని తట్టుకొని నిలబడగల వ్యక్తిగా రేవంత్ రెడ్డివైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.