‘తొలి వెలుగు’ ప్రత్యేక ప్రతినిధి
కేసీఆర్ సర్కారుపై సమరానికి ఏఐసీసీ రాష్ట్ర కాంగ్రెస్‌లో భారీ మార్పులకు శ్రీకారం చుడుతున్నట్టుగా తెలుస్తోంది. గులాబీ బాస్ టార్గెట్‌గా పోరు సలిపే సేన కోసం రేవంత్ టీమ్‌ను రెడీ చేయనుంది. అటు యూపీ పీసీసీకి ప్రియాంక గాంధీని, ఇటు తెలంగాణ పీసీసీకి రేవంత్‌రెడ్డిని తీసుకోవడంలో కాంగ్రెస్ బిగ్‌బాస్ గేమ్ ప్లాన్ ఏంటి?
కాంగ్రెస్ పార్టీలో హేమహేమీలు ఉన్నప్పటికీ రేవంత్ వైపే అధిష్టానం ఎందుకు మొగ్గు చూపినట్టు? రేవంత్‌కు ఇస్తే సీనియర్ల నుంచి వ్యతిరేకత వస్తుందని తెలిసినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ పగ్గాలు రేవంత్‌కే ఎందుకు ఇస్తున్నట్లు..? అసలు అధిష్టానం యాక్షన్ ప్లాన్ ఏంటీ ..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలా పడ్డ కాంగ్రెస్.. దాన్ని నుంచి తేరుకొని మళ్ళీ యాక్టివ్ అవ్వాలని చూస్తోంది. నైరాశ్యంలో కూరుకుపోయిన రాష్ట్ర నేతల్లో చలనం తీసుకొచ్చే పనిలో పడింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా ఉన్న పరిస్థితులు ఇప్పుడు బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్‌గా మారిన నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్ అయ్యింది. రాష్ట్రంలో ఏమీ లేదనుకున్న బీజేపీ తన దూకుడు పెంచడం.. కాంగ్రెస్ పూర్తిగా వెనకపడి పోతుండటంతో పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడ్డారు కాంగ్రెస్ పెద్దలు. రాబోయే ప్రమాదాన్ని గ్రహించిన సోనియాగాంధీ తెలంగాణపై దృష్టి సారించారని సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో పార్టీని బతికించాలంటే ఎవరి వల్ల అవుతుందని ఆమె పలు సర్వేలు చేయించినట్టు చెబుతున్నారు. అన్ని సర్వేలూ కూడా ఒకే ఒక్కడి పేరు సూచించాయట. ఆ పేరే తెలంగాణ ఫైర్‌బ్రాండ్ రేవంత్ ! తెలంగాణలో ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ ఉన్న నేత రేవంత్‌రెడ్డి. జనంలో క్రేజ్ ఒక్కటే కాకుండా జనం సమస్యలపై అవగాహన ఉంది. అన్నింటికీ మించి దూకుడు ఉంది. కేసీఆర్‌కు ధీటుగా వాగ్ధాటి అతని సొంతం. ఏ పరిస్థితుల్లో కూడా కేసీఆర్‌తో లాలూచీ పడడు అనే నమ్మకమే రేవంత్ ఎంపికకు కారణంగా కనిపిస్తున్నాయి. కొన్నిరోజులుగా రాష్ట్ర కాంగ్రెస్ పూర్తిగా నైరాశ్యంలో మునిగిపోయి ఉంది. రోజురోజుకూ బీజేపీ బలపడ్డట్టుగా కనిపిస్తోంది. ఈమధ్య రాష్ట్రంలో బీజేపీ కొన్ని సమస్యలపై టీఆర్ఎస్‌ను విమర్శిస్తూ ప్రజాక్షేత్రంలో పోరాడుతుంటే తెలంగాణ పీసీసీ మాత్రం చొద్యం చూస్తూ ఉండిపోయిందని విమర్శలు వున్నాయి. రేవంత్ ఎంటరయితే బీజేపీ కంటే 100 రెట్ల స్పీడులో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి టీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టేవాడని గాంధీభవన్ వర్గాలు ఓపెన్‌గనే వ్యాఖ్యానించాయి.
ఈమధ్య కాలంలో విద్యుత్ కొనుగోళ్ళ వ్యవహారంపై బీజేపీ టీఆర్ఎస్ మధ్య విమర్శల దాడి కొనసాగుతుంటే, మధ్యలో రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకుని దూకుడు పెంచారు. అటు విద్యుత్ అధికారులు, కేసీఆర్‌తో పాటు, మరోవైపు బీజేపీని కూడా కార్నర్ చేసే వ్యూహాన్ని ఫాలో అయ్యాడు. ఈ కొనుగోళ్ళలో ఎక్కడెక్కడ ఏం జరిగిందనే అంశాలను వివరిస్తూ, ఆధారాలతో కేంద్ర విచారణ సంస్థల ముందుకు వెళతామని స్పష్టం చేశారు. బీజేపీ సర్కారుకు చిత్తశుద్ది ఉంటే తమ ఫిర్యాదుతో తామిచ్చే ఆధారాలతో విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. దాంతో టీఆర్ఎస్-బీజేపీ ఫైట్ నిజం కాదని, వారిద్దరి మధ్యా లాలూచి వుందనే మెసేజ్ జనంలో పోయేలా చేయడంలో రేవంత్ సక్సెస్ అయ్యాడు. అదే సమయంలో ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందనే నమ్మకం కలిగించడంలో కూడా రేవంత్ ఫలితాన్ని సాధించగలిగాడు. ఇదే రేవంత్ బలం. తెలంగాణలో ప్రతి గ్రామంలో రేవంత్‌కు అభిమానులు ఉన్నారు. వాళ్లకు కాంగ్రెస్ క్యాడర్ తోడు అయితే టీఆర్ఎస్‌ను గద్దెదింపడం అంత కష్టమేమీ కాదు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న సీనియర్ నేతలు కేవలం గాంధీభవన్‌కు పరిమితమై ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప, ప్రజల మధ్యలోకి వెళ్లి పోరాడే వాళ్ళు లేరు. రేవంత్‌కు వయస్సు ఉంది. మాస్ ఇమేజ్ ఉంది. అన్నింటికంటే ఎక్కువగా కేసీఆర్‌పై వ్యక్తిగతంగా కోపం ఉంది. ‘కేసీఆర్‌ను ఎదుర్కొనే ఒకేఒక్కడు రేవంత్’ అనే అంచనా తెలంగాణ ప్రజల్లో చాలా బలంగా ప్రచారంలో ఉంది. అందుకే అధిష్టానం రేవంత్ వైపు మొగ్గుచూపినట్టుగా తెలుస్తోంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టు .. ఇటు టీఆర్ఎస్ .. అటు బీజేపీలను కార్నర్ చేసేందుకు పక్కా ప్లాన్‌తో ముందుకు వెళుతున్నారు ఢిల్లీ హస్తం నేతలు.