హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నూతన రథసారథిగా రేవంత్‌రెడ్డి నియమితులు కానున్నారా? పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నుంచి త్వరలో దీనిపై ఒక ప్రకటన రానున్నదా? యస్.. అనే అన్సర్ ఢిల్లీ నుంచి వినిపిస్తోంది. రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడు కాబోతున్నాడనే సమాచారం తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. రేవంత్ కుటుంబంతో సహా ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఒక గ్రూప్ ఫోటో దిగి దాన్ని తన మిత్రులకు షేర్ చేశారు.
తెలంగాణా కాంగ్రెస్ కొత్త సారధిగా రేవంత్ రెడ్డిని నియమించే అవకాశం ఉందని అసలు ఎప్పటి నుంచో పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పొలిటికల్ ఫైటింగ్‌లో డేరింగ్ లీడర్‌గా గుర్తింపు పొందిన రేవంత్‌కు పగ్గాలు అప్పగిస్తే కొత్త ఉత్సాహం వస్తుందని కేడర్ అంటోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌లో ఓటమి చవిచూసినప్పటికీ.. రెట్టించిన ఆత్మ విశ్వాసంతో అతిపెద్ద మల్కాజిగిరి లోక్సభ సెగ్మెంట్ నుంచి ఎంపీగా విజయం సాధించి కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు రేవంత్.
కార్యకర్తలకు చాలా దగ్గరగా ఉంటూ ఉత్సాహంగా ముందుకు వెళ్లే రేవంత్‌కు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి అప్పగించాలని సోనియా ఎప్పటినుంచో అనుకుంటున్నారని భావిస్తున్నారు. అందులో భాగంగానే రేవంత్‌ను పిలిపించి మాట్లాడినట్టు చెప్పుకుంటున్నారు. కుటుంబ సమేతంగా సోనియాను కలిసిన రేవంత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను ఆమెకు పనితీరును వివరించినట్లు తెలుస్తోంది.