తెలంగాణలో ఎన్నికలకు చాలా టైమే ఉంది. అయినా.. పార్టీలన్నీ ఇప్పటినుంచే గెలుపు వ్యూహాల్లో ఉన్నాయి. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు శ్రీకారం చుట్టగా… కాంగ్రెస్ పార్టీ ఓ అడుగు ముందుకేసి ఇప్పటికే చేరికలను స్టార్ట్ చేసేసింది. రెండు రోజులుగా కొత్త నాయకులు, కార్యకర్తల చేరికలతో గాంధీ భవన్ ఏరియాలో రద్దీ కనిపిస్తోంది. రేవంత్ దూకుడు చూస్తుంటే పెద్ద ప్లాన్ లోనే ఉన్నారని కనిపిస్తోంది.
ఈమధ్యే డిజిటల్ మెంబర్ షిప్ స్టార్ట్ చేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు చేరికలపై దృష్టి పెట్టినట్లు అనిపిస్తోంది. బుధవారం ఉపాధ్యాయుల సంఘం మాజీ నేత హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరగా.. తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఇలాకా నుండి భారీగా కాంగ్రెస్ లోకి చేరికలు జరిగాయి. జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా నుండి దాదాపు 300 మంది హస్తం గూటికి చేరారు. ఈ సందర్భంగా ప్రసంగించిన రేవంత్ రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు.
రైతు సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కారం చేయకపోగా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయని విమర్శించారు రేవంత్. రైతులను ఆదుకోవడానికి అటు కిషన్ రెడ్డి గానీ, ఇటు బండి సంజయ్ గానీ ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గ చర్యలన్నింటి వెనక మోడీ, కేసీఆర్ ఉన్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు రేవంత్. దీనికోసం కార్యకర్తలంతా నిరంతరం కష్టపడాలని పిలుపునిచ్చారు. ఎర్రబెల్లి గెలిచిన తర్వాత అభివృద్ధిపై ఏ మాత్రం దృష్టి సారించలేదన్నారు. ఆయనపై నియోజకవర్గంలో జనం విసిగిపోయి ఉన్నారని.. అందుకే కాంగ్రెస్ లోకి చేరుతున్నారని తెలిపారు.