– కొడంగల్ కు కేసీఆర్ చేసిందేంటి?
– నేను చేసిన అభివృద్ధే కనిపిస్తోంది..
– చర్చకు ఎవరొస్తారో రండి..
– రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే
– మా హయాంలో క్విటాల్ వడ్లు రూ.2,500 కొంటాం
– రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం
– కొడంగల్ రచ్చబండలో రేవంత్
రైతు డిక్లరేషన్ ను జనంలోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ రచ్చబండ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్ లో పర్యటించారు. కొడంగల్ అభివృద్ధి గురించి మాట్లాడిన రేవంత్.. నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్న కేటీఆర్ చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. తన హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప కేసీఆర్ పాలనలో ఏం చేయలేదన్నారు. దీనిపై చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు.
ఎనిమిదేళ్లలో పేదలకు న్యాయం జరగలేదన్న రేవంత్.. కేసీఆర్ ఫ్యామిలీ, ఆయన అనుచరులు, చుట్టాలే వందల కోట్లు సంపాదించారని ఆరోపించారు. రాష్ట్రంలో రైతుల అవస్థలు చూసి చలించిపోయి రైతు డిక్లరేషన్ తీసుకొచ్చామని అన్నారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. అధికారంలోకి వచ్చిన వెంటనే క్విటాల్ వడ్లను రూ.2,500 కు కొంటామని హామీ ఇచ్చారు. అలాగే రైతులు ఎవరూ బ్యాంకు రుణాలు చెల్లించొద్దని.. రూ.2 లక్షల వరకు మాఫీ చేస్తామని స్పష్టం చేశారు.
కేసీఆర్, కేటీఆర్ ను తెలంగాణ పొలిమేర దాటే వరకు తరమాలని.. ఈ ప్రాంతానికి రైలు మార్గం రాకుండా చేశారని ఆరోపించారు. కొడంగల్ కు కృష్ణా జలాల కోసం నారాయణ పేట-కొడంగల్ ఎత్తిపోతలకు 69 జీవో తెచ్చానని.. ఇక్కడ అభివృద్ధి అనేది తాను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడే జరిగిందని అన్నారు. 2011లోనే తాగునీటి శాశ్వత పరిష్కారం చూపానని వెల్లడించారు.
తెలంగాణ ఇచ్చినాక పేదలకు మేలు జరగలేదని విమర్శించారు. పండించిన చివరి గింజ వరకు తాము కొంటామని హామీ ఇచ్చారు. రైతు డిక్లరేషన్ ను కాంగ్రెస్ క్యాడర్ గ్రామ గ్రామానికి తీసుకెళ్లాలని ఆదేశించారు. ప్రభుత్వం వడ్లు కొనకపోవడం, ఐకేపీ సెంటర్లు తెరవకపోవడంతో చాలామంది రైతులు చనిపోయారని.. కేసీఆర్ ఒక్కరినైనా పలకరించారా? అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.