టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అర్ధరాత్రి ఒంటి గంటకు ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా జాతరను సందర్శించారు. ఈ సందర్భంగా నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జాతర నిర్వాహకులైన మెస్రం వంశీయులను రేవంత్ సన్మానించారు. ఆ తరువాత పద్మశ్రీ అవార్డు గ్రహీత గుస్సాడి కనకరాజును రేవంత్ సన్మానించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ సాంప్రదాయాలను కాపాడటంలో ఆదివాసీలు ప్రపంచానికి ఆదర్శం అన్నారు రేవంత్ రెడ్డి. ఆదివాసీ బిడ్డల ఆశీర్వాదంతో ఇంద్రవెల్లిలో గొప్ప సభ నిర్వహించామన్నారు. తాను ఇక్కడికి ఓట్ల కోసం రాలేదని ఆదివాసీల సాంప్రదాయం పట్ల అపార గౌరవంతో ఇక్కడకు వచ్చానన్నారు.
ఆదివాసీలకు ఏ అవసరం ఉన్నా అండగా ఉంటానని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఆదివాసీ బిడ్డే పీసీసీ అధ్యక్షుడైతే ఎంత స్వేచ్ఛగా కలవగలుగుతారో అంతే స్వేచ్ఛతో నా దగ్గరకు రావచ్చు అని రేవంత్ అన్నారు.
ఆదివాసీలు మిగతా వర్గాలతో సమానంగా అభివృద్ధి చెందాలని అదే మా సంకల్పం అని అన్నారు రేవంత్ రెడ్డి.