– శాంతియుత ర్యాలీని ఉద్రిక్తంగా మార్చారు
– మోడీ మెప్పు కోసమే ఇదంతా
– వెంటనే పెట్టిన అక్రమ కేసులన్నీ ఎత్తేయాలి
– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రేవంత్ ఆగ్రహం
కేంద్ర ప్రభుత్వ రహస్య ఆదేశాలతోనే తమ శాంతియుత ర్యాలీని పోలీసులు భగ్నం చేశారని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దీని ద్వారా నరేంద్ర మోడీని ప్రసన్నం చేసుకునేందుకు కేసీఆర్ ప్రయత్నించారని విమర్శించారు. ఛలో రాజ్ భవన్ కార్యక్రమం సందర్భంగా అరెస్ట్ అయిన విడుదలై బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడారు. కేంద్రాన్ని సంతృప్తి పరిచేందుకే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ శ్రేణులపై దాడులు చేయించిందని మండిపడ్డారు.
తెలంగాణ ఉద్యమం సందర్భంగా నాటి కాంగ్రెస్ సర్కారు ఇలాగే వ్యవహరించి ఉంటే కేసీఆర్, కేటీఆర్ ఎక్కడ ఉండేవాళ్లని ప్రశ్నించారు రేవంత్. మోడీ, కేసీఆర్ ఇద్దరిదీ ఒకే బాట అని విమర్శించారు. కాంగ్రెస్ శ్రేణులపై దాడులను నిరసిస్తూ శుక్రవారం జిల్లా కేంద్రాల్లో, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అక్రమ కేసులు బనాయిస్తూ ప్రజాస్వామ్యయుతంగా చేస్తున్న నిరసనను పోలీసులు దాడి చేసి ఉద్రిక్తంగా మార్చారని ఆరోపించారు.
రేణుకా చౌదరి నిరసన చేస్తున్న క్రమంలో కింద పడి పోతూ ఉండగా ఎస్సైని పట్టుకుంటే దాన్ని దాడిగా చిత్రీకరిస్తూ, అక్రమంగా కేసులు పెట్టడం బాధాకరమన్నారు రేవంత్. కాంగ్రెస్ నేతలపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు, ప్రభుత్వం తమ తీరు మార్చుకోవాలని లేనిపక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను ఈడీ విచారణ నిమిత్తం వేధింపులకు గురిచేయడం సరికాదని హితవు పలికారు. మూసేసిన కేసులతో వేధిస్తున్నారని.. ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించడానికే మోడీ సర్కార్ ఇలా చేస్తోందని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలను బెదిరించడానికే కాంగ్రెస్ అగ్రనేతలను కేంద్రం వేధిస్తోందన్న ఆయన.. రాజ్యసభ ఎన్నికల్లో పైచేయి సాధించడానికి కుట్రలు చేస్తోందని ఫైరయ్యారు. మరోవైపు పోలీసుల లాఠీచార్జిలో గాయపడి ఆసుపత్రిపాలైన టీపీసీసీ అధికార ప్రతినిధి కిరణ్ కుమార్ చామలను రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.