ప్రాజెక్టులు, అభివృద్ధి అంటూ దళిత, గిరిజనుల భూములను లాక్కొని… వారిని రోడ్డున పడేశారని సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. గాంధీభవన్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన… జాతీయ జెండాను ఎగురువేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ పోడు భూములకు పట్టాలిస్తే హరితహారం పేరుతో ఆడబిడ్డలను చెట్లకు కట్టేసి, హింసించి లాక్కొంటున్నారని ఆరోపించారు రేవంత్. ఆఖరికి చంటి పిల్లలు ఉన్న తల్లులను జైలుకు పంపి పాశవిక ఆనందం పొందారని మండిపడ్డారు. కేంద్రంలో మోడీని, రాష్ట్రంలో కేసీఆర్ ని ఓడించినప్పుడే రైతులకు, యువతకు నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు అని అన్నారు. ఇద్దరినీ గద్దె దించేందుకు ఇందిరాగాంధీ స్ఫూర్తితో ముందుకెళ్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
రైతులను బానిసలుగా మార్చి అంబానీ, ఆదానీలకు తాకట్టుపెట్టేలా వ్యవసాయ చట్టాలు తెచ్చారని ఆరోపించారు రేవంత్. ఇంటికో ఉద్యోగం అని చెప్పిన కేసీఆర్… సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్న మోడీ నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. ఏడేళ్లలో కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాల కంటే రిటైర్ అయినవే ఎక్కువని సెటైర్లు వేశారు రేవంత్ రెడ్డి.