– బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే!
– కేసీఆర్ వ్యాఖ్యలతో ఇది అర్థమౌతోంది
– బీజేపీ ఓటమిని ఒప్పుకోవడానికి..
– కేసీఆర్ కు ఎందుకు మనసు ఒప్పడం లేదు
– కర్ణాటక తీర్పు దేశానికి దశ, దిశ నిర్ణయించేది
– ప్రజల కోసం పది మెట్లు దిగడానికైనా సిద్ధం
– బీజేపీలో ఉన్న లీడర్లు కాంగ్రెస్ లోకి రండి
– కేసీఆర్ ను ఓడించడం బీజేపీతో కాదు
– రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
కర్ణాటక ఫలితాలపై దేశం మొత్తం చర్చ జరుగుతోందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. హైదరాబాద్ గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. మోడీ బ్రాండ్ కు కాలం చెల్లిందని.. ఈడీ, సీబీఐతో ఎన్నికల్లో నెగ్గాలని భావించిన ఆయన్ను కర్ణాటక ప్రజలు ఓడించారని అన్నారు. మోడీతో సహా కేంద్ర మంత్రులంతా కర్ణాటకలో మోహరించారని.. జై బజరంగబలి, ముస్లిం రిజర్వేషన్లు, కులాల విభజన తెచ్చి కుట్ర పూరితంగా గెలవాలని ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. కానీ, కర్ణాటక ప్రజలు మోడీ కుట్రలను తిప్పికొట్టి కాంగ్రెస్ ను గెలిపించారని తెలిపారు. ఈ గొప్ప తీర్పును బుద్ధిజీవులు స్వాగతించారని అన్నారు.
ప్రజాస్వామ్యం బతకాలని బీజేపీని ఓడించేందుకు అందరూ కలిసి వచ్చారని చెప్పారు రేవంత్. ఈ అద్భుతమైన తీర్పును ప్రపంచం అభినందిస్తుంటే కేసీఆర్ మాత్రం ఆలోచించాల్సిన పనిలేదని మాట్లాడారని మండిపడ్డారు. మోడీని ఓడిస్తానని కేసీఆర్ పెద్ద పెద్ద మాటలు చెప్పారని.. కర్ణాటకలో హంగ్ తీసుకురావాలని చేసిన కుట్రలను తాము బయటపెట్టామని వివరించారు. కేసీఆర్ కర్ణాటక ప్రజల తీర్పును అభినందిస్తారని అనుకున్నామన్న రేవంత్.. ఈ ఫలితాల ప్రభావం తెలంగాణపై ఉండదని బండి సంజయ్ చెప్పిన మాటలనే చెప్పారని మండిపడ్డారు. కర్ణాటకలో మోడీ ఓటమిని అంగీకరించేందుకు కూడా కేసీఆర్ కు మనసు ఒప్పడం లేదన్నారు. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ అవసరం ఉందని అన్ని పార్టీలు మాట్లాడుతున్నాయని.. కానీ, కేసీఆర్ మాట్లాడిన మాటలు మోడీ నాయకత్వాన్ని సమర్ధించేలా ఉన్నాయని ఆరోపించారు.
కర్ణాటకలో బీజేపీ చేసిందే తెలంగాణలో కేసీఆర్ చేస్తున్నారన్న రేవంత్.. ఈ రెండు పార్టీలు ఒకే తాను మొక్కలని చమత్కరించారు. మోడీ, కేసీఆర్ వేర్వేరు కాదన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకే విడిపోయినట్లు నాటకం ఆడుతున్నారని విమర్శించారు. కర్ణాటక ప్రజల తీర్పు దేశానికి దశ, దిశ నిర్ణయించే తీర్పు అని తెలిపారు. తెలంగాణ ప్రజల పక్షాన కర్ణాటక ప్రజల తీర్పును అభినందిస్తున్నామన్న ఆయన.. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ కుటుంబం బిచ్చమెతుకుని బతకాల్సి వచ్చేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్ని రకాల త్యాగాలు చేసి ప్రజల కోసం కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు.
‘‘మిగులు బడ్జెట్ తో రాష్ట్రం ఏర్పాటు చేయడం ద్రోహమా? కేసీఆర్ కు సీట్లు ఇవ్వడం, కేంద్రమంత్రిగా అవకాశం ఇవ్వడం ద్రోహమా? ఆయన్ను నమ్మినందుకు కాంగ్రెస్ ను ద్రోహులు అంటున్నారా? బీసీ జనాభా లెక్కించాలని కాంగ్రెస్ స్పష్టమైన విధానం తీసుకుంది. బీసీ జనాభా లెక్కించడాన్ని ఎవరు అడ్డుకుంటున్నారో మోడీ చెప్పాలి. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. పదవి పోయే ముందు బీసీలు గుర్తొచ్చారా? పార్లమెంటులో బీసీ జనగణనకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. రాష్ట్రంలో వివేక్, ఈటల, రాజగోపాల్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి… కేసీఆర్ ను ఓడించేందుకు బీజేపీ తో కలిశారు. కానీ, బీజేపీ వారిని నమ్మదు, వారు బీజేపీని నమ్మరు. అందర్నీ కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నా. పార్టీ కోసం, తెలంగాణ ప్రజల కోసం పది మెట్లు దిగడానికైనా సిద్ధం. కాంగ్రెస్ పార్టీ అమ్మలాంటిది. కేసీఆర్ ను ఓడించడం బీజేపీతో కాదు. ఎందుకంటే బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే’’ అని విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి.
తెలంగాణ అభ్యున్నతికి పని చేయలనుకునేవారు కాంగ్రెస్ తో కలిసి రావాలని కోరారు. ఓటమి ఖాయమని కేసీఆర్ కు అర్థమైందని.. అందుకే ఎమ్మెల్యేలపై నెట్టి ఓటమిని తప్పించుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. 200 కోట్ల ప్రభుత్వ ధనంతో ఇతర రాష్ట్రాల్లో ప్రకటనలు ఇస్తారా? రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ఇతర రాష్ట్రాల్లో ప్రకటనలకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఖాతాలో డబ్బులు ఖర్చు పెట్టుకుంటే అభ్యంతరం లేదని.. కేసీఆర్ కు ఇవి చివరి రాష్ట్ర అవతరణ వేడుకలు అని విమర్శించారు. తరువాత జరిగేది కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనేనని ధీమా వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.