– రాష్ట్రంలో వరద బీభత్సం ప్రభుత్వ నిర్లక్ష్యమే
– ముందు నుంచీ హెచ్చరించినా లెక్క చేయలేదు
– ఇకనైనా కేసీఆర్ మందు మత్తు వీడాలి!
– జరిగిన నష్టంపై కేంద్రానికి లేఖ రాయాలి
– మోడీని తెలంగాణకు రప్పించే బాధ్యత బీజేపీదే
– కాంగ్రెస్ కూడా క్షేత్రస్థాయిలో నష్టంపై అంచనా వేస్తుంది
– ఢిల్లీలో మీడియాతో రేవంత్ రెడ్డి
రాజకీయ అంశాలపై తప్ప ప్రజలకు సాయం చేసేందుకు కేసీఆర్ సమీక్షలు జరపడం లేదని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ వరద పరిస్థితులు, సహాయక చర్యలపై అసహనం వ్యక్తం చేశారు. 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వరద ప్రభావం ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీట మునిగిందని.. మరో రెండు మూడేళ్లు నీళ్లు లిఫ్ట్ చేసే పరిస్థితి ఉండదని చెప్పారు. కేసీఆర్ అవినీతికి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిదర్శనమన్నారు. ఇకనైనా సీఎం మొద్దు నిద్ర వదిలి వరద సహాయక చర్యలు ముమ్మరం చేయాలని డిమాండ్ చేశారు.
17 తేదీ నుంచి ఆదిలాబాద్, వరంగల్, రీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ సహాయక బృందాలు పర్యటించి వరద బాధితులకు సహాయం అందజేస్తాయని తెలిపారు రేవంత్. వరద నష్టాన్ని అంచనా వేయడానికి క్షేత్ర స్థాయిలో పర్యటిస్తామని వివరించారు 10-12 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని.. వెంటనే ఆర్ధిక నష్టంపై కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. అలాగే.. ప్రధాని, హోంమంత్రి తెలంగాణలో వరద నష్టాన్ని అంచనా వేయడం కోసం రాష్ట్రానికి రావాలన్నారు. వరద బాధితులకు కేంద్రం సహాయం అందించాలని.. రాష్ట్ర ప్రభుత్వం భారీ వర్షాలు, వరదలపై ముందస్తు చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు.
కేసీఆర్ ను కాంగ్రెస్ పార్టీ ముందు నుంచే హెచ్చరిస్తూనే ఉందని.. ఆయన వైఫల్యం కారణంగానే అదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు అన్ని ప్రాంతాలు నీట మునిగాయని ఫైరయ్యారు. సరైన సహాయక పునరావాస చర్యలు చేపట్టలేదని.. కేసీఆర్ ఇప్పటికైనా నిద్రమత్తు, మందు మత్తు వదలాలని హితవు పలికారు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం వారీగా కాంగ్రెస్ సహాయక బృందాలను నియమిస్తున్నామని తెలిపారు. ఆయా బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి సహాయ కార్యక్రమాలు అందజేస్తాయని.. జరిగిన నష్టాన్ని అంచనా వేస్తాయని వివరించారు. పీసీసీ అధ్యక్షుడిగా వరద బాధిత ప్రాంతాల్లో తాను కూడా పర్యటిస్తానని చెప్పారు.
జరిగిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్రానికి లేఖ రాయాలని.. బీజేపీ నేతలు ప్రధానిని తెలంగాణలో పర్యటించేలా చూడాలన్నారు రేవంత్. ప్రజలు నిండా నీట మునిగి అన్నమో రామచంద్ర అంటున్నారన్న ఆయన.. కాంగ్రెస్ తరఫున కూడా ప్రధానికి, కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని వివరించారు. రైతులు సహా నష్టపోయిన వారందరినీ తక్షణం ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఇక అక్టోబర్ 2 నుంచి రాహుల్ గాంధీ చేపట్టబోయే భారత్ జోడో యాత్రపై సమావేశం జరిగిందని చెప్పారు రేవంత్. మోడీ దేశాన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు వారీగా ముక్కలు ముక్కలుగా విడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని.. రైతులు, నిరుద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. మోడీ విధ్వంసం చేస్తున్న విషయాన్ని, రాష్ట్రాల్లో దళితులు, గిరిజనులు సహా వివిధ వర్గాలపై జరుగుతున్న దాడులను ఎత్తి చూపేందుకు రాహూల్ గాంధీ యాత్ర చేస్తున్నారని వివరించారు. దాదాపు 150 రోజులపాటు 3,600 కిలోమీటర్లు ఇది కొనసాగుతుందన్నారు. మక్తల్ వద్ద తెలంగాణలో ప్రవేశించి జుక్కల్ మీదుగా నాందేడ్ కు రాహుల్ యాత్ర వెళ్తుందని తెలిపారు. తెలంగాణలో యాత్రను అద్భుతంగా నిర్వహిస్తామని.. పార్టీ ప్రజా ప్రతినిధులు నేతలు సహా అన్ని అనుబంధ విభాగాలను భాగస్వాములు చేస్తామన్నారు రేవంత్ రెడ్డి.