బీజేపీ, కాంగ్రెస్ జాతీయ నేతలను తీసుకొచ్చి భారీ సమావేశాలు నిర్వహించాయి. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశాయి. కానీ.. సీఎం కేసీఆర్ మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు. ఫాంహౌస్ కే పరిమితం అయిపోయారు. కేటీఆర్ సహా ఇతర నేతలు ఎదురుదాడి చేసినా.. కేసీఆర్ మౌనంపైనే సర్వత్రా చర్చ జరిగింది. అయితే.. 16 రోజుల తర్వాత ప్రగతి భవన్ కు చేరుకున్నారు కేసీఆర్.
సీఎం ఎట్టకేలకు ఫాంహౌస్ వీడి ప్రగతి భవన్ కు రావడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సెటైరికల్ ట్వీట్ చేశారు. కుంభకర్ణుడులా కేసీఆర్ 16 రోజులు ఫాంహౌస్ లో సేదతీరి వచ్చారని… రైతేమో ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నాడని విమర్శించారు. ఐకేపీ కేంద్రాలలో టార్పాలిన్ ల గతిలేక అన్నదాత కష్టం వర్షపునీటిలో కొట్టుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
“ఇదేం రాక్షసత్వం కేసీఆర్! కర్షకులు నీకు కర్రుకాల్చి వాత పెట్టుడు ఖాయం” అంటూ మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ఏప్రిల్ 29 నుంచి కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ లోనే ఉన్నారు. దాదాపు 16 రోజుల తర్వాత సోమవారం ప్రగతిభవన్ కు వచ్చారు.
బుధవారం మంత్రులు, కలెక్టర్లతో కేసీఆర్ సమావేశం జరగనున్నట్లు సమాచారం. ఇందులో పట్టణ, పల్లెప్రగతిపై సమీక్ష చేయనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ తమ సభలతో ప్రభుత్వంపై విరుచుకుపడిన నేపథ్యంలో కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది.