దేశ ప్రధాని నరేంద్ర మోడీ పెద్దగా చదుకోకపోవడం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. హైదరాబాద్ గాంధీ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. బీజేపీ నేతలకు ఆర్మీ ఎలా పని చేస్తుందో అర్థం కావడం లేదని.. అగ్నిపథ్ తో నాలుగేళ్ల తర్వాత వారు ఏం చేయాలని ప్రశ్నించారు.
ఇజ్రాయిల్ అనేది చిన్న దేశం.. దానితో పోల్చడం కరెక్ట్ కాదన్నారు. అమెరికా లో ఆర్మీ నుంచి బయటకు రాగానే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వివరించారు రేవంత్. మన దేశంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని… నిరుద్యోగ తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపారు. అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకుని ప్రధాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆయుధాలు వాడటం ఎలా అన్నది నాలుగేళ్లు నేర్పించి బయటకు పంపితే ఏం చేస్తారని ప్రశ్నించారు. అసాంఘిక కార్యకలాపాల వైపు మళ్లితే పరిస్థితి ఏంటని నిలదీశారు. 22 సంవత్సరాలకు ఆర్మీ నుంచి బయటకు వస్తే.. 70 ఏళ్లు వచ్చే వరకు అభ్యర్ధికి ఎలాంటి ఉద్యోగం లేకుండా గాలికి తిరగాల్సిన పరిస్ధితి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం మోడీ ఇలాంటి అర్ధం పర్ధం లేని నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నట్లు రేవంత్ స్పష్టం చేశారు. అగ్నిపథ్ నిరసనల్లో పాల్గొని కేసులు నమోదైన అభ్యర్థులకు న్యాయ సహాయం చేస్తామని తెలిపారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని అగ్నిపథ్ పథకాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.