ప్రగతి భవన్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు నేతలు. దీనిపై తదుపరి ఏం చేయాలని సమాలోచనలు జరుపుతున్నారు. ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి కూడా తగ్గేదే లేదంటూ.. బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నారు. తనపై ఫిర్యాదు చేసిన గులాబీ నేతలకు కౌంటర్ గా ఆయన కూడా డీజీపీకి కంప్లయింట్ చేశారు.
ఎమ్మెల్యేల కోనుగోలు వ్యవహారంలో సీబీఐ విచారణకు నో చెబుతోంది ప్రభుత్వం. ఈ పంచాయితీ కోర్టుల చుట్టూ తిరుగుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ను వీడి గులాబీ గూటికి చేరిన నేతలను టార్గెట్ చేసుకున్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ లో కలిసిన 12 మంది ఎమ్మెల్యేలపై కూడా విచారణ జరపాలని కోరుతూ డీజీపీకి ఫిర్యాదు చేశారు.
అధికార పార్టీ ప్రలోభాలకు గురి చేసి కాంగ్రెస్ నుంచి అక్రమంగా వారిని చేర్చుకుందని అన్నారు రేవంత్. ఈ అంశంలో గతంలోనే ఫిర్యాదు చేశామని.. జనవరి 6వ తేదీన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేసినట్టు వివరించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలకు ఆర్థిక, రాజకీయ ప్రలోభాలు ఆశ చూపి గులాబీ కండువా కప్పారని.. ఈ విషయంలో తాము ఇప్పటికే హైకోర్టులో కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కు తమ ఫిర్యాదును జత చేయాలని కోరారు రేవంత్. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ప్రలోభాల విషయంలో ముఖ్యమంత్రి, 12 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.