ఆ చేతులు నలుగురికి అన్నం పెట్టేవి. కానీ.. ఏం చేస్తాం.. అసమర్ధ నాయకుల చేతగానితనంతో ఉరికొయ్యకు వేలాడుతున్నాయి. పండించిన పంట కొనరు.. గిట్టుబాటు ధర కల్పించరు.. రుణమాఫీ చేస్తామని చేయరు. పేరుకు రైతుల పక్షమని డబ్బాలు కొట్టుకోవడం తప్ప.. చేస్తోందేమీ లేదు. ఓవైపు అమ్ముడుపోని ధాన్యం కుప్ప.. ఇంకోవైపు అప్పుల కుప్ప.. ఏం చేయాలో పాలుపోని స్థితిలో అన్నదాతకు పురుగుల మందే పెరుగన్నమౌతోంది.
తెలంగాణలో రైతుల పరిస్థితి చూస్తే ఎవరికైనా కళ్లు చెమ్మగిల్లుతాయి. రాష్ట్రంలో మరణమృదంగం ఆ విధంగా ఉంది మరి. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. పంటను కొనే నాథుడు లేడు, అమ్మిన పంట సొమ్ముల కోసం కళ్లు కాయలుకాచేలా ఎదురుచూస్తోన్న దౌర్భాగ్య పరిస్థితి. ఇంటి ముందు అప్పులోడి లొల్లి. సమస్య పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి తీర్థయాత్రలు, రాజకీయ భేటీలతో బిజీ.. అంటూ రాష్ట్రంలోని రైతుల దుస్థితిని వివరించారు రేవంత్.
నిజానికి రేవంత్ చెప్పింది నిజమే. ఓవైపు వానాకాలం పంట అమ్ముడుపోక.. అన్నదాత గుండె వరి కుప్పపైనే ఆగుతుంటే.. కేసీఆర్ శ్రీరంగం, చెన్నై అంటూ తీర్థయాత్రలకు వెళ్లారు. ప్రభుత్వం తన పని తాను చేస్తుందని మంత్రులు, టీఆర్ఎస్ నేతలు చెబుతున్నా.. ఆచరణలో మాత్రం నత్త నడకగానే పనులు సాగుతున్నాయి. అకాల వర్షాలతో పంటంతా తడిసిపోయి ఎంతో నష్టపోయారు రైతులు.. కొన్ని చోట్ల అయితే తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడం మళ్లీ వర్షం పడడం.. తడవడం.. ఇదే జరుగుతోంది. అసలే కొనుగోళ్లు జరగక సతమతమౌతున్న రైతుకు.. యాసంగిలో వరి వద్దని పిడుగులాంటి వార్త వినిపించింది ప్రభుత్వం. అంతా కేంద్రం వల్లేనంటూ ఓ స్టేట్ మెంట్ ఇచ్చి వదిలేసింది. ఇలాంటి పరిస్థితుల్లో అన్నదాత ఆత్మహత్యే శరణ్యమని భావిస్తున్నాడు.
మరోవైపు ఏటా పెట్టుబడులు పెరుగుతున్నా ఆ మేరకు దిగుబడులు ఉండడం లేదు. లక్షలకు లక్షలు అప్పులు తెచ్చి పంటలు సాగుచేస్తున్నా పెట్టిన పెట్టుబడిలో సగం కూడా తిరిగి రావడం లేదు. ఫలితంగా అప్పుల ఊబిలో కూరుకుపోతున్న పరిస్థితి. దీనికితోడు 2018 డిసెంబర్ 11వరకు ఉన్న వడ్డీ, అసలు కలిపి రూ.లక్ష వరకు మూడేళ్లలో మాఫీ చేస్తామని ఎన్నికల టైంలో హామీ ఇచ్చిన ప్రభుత్వం దాన్ని ఇంతవరకు పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. దీంతో అప్పు మాఫీ కాక, బ్యాంకుల్లో కొత్తది పుట్టక, అధిక వడ్డీకి బయట డబ్బులు తెచ్చుకుని తిరిగి తీర్చలేక ప్రాణాలు వదులుతున్నారు.
నేషనల్ క్రైమ్ బ్యూరో ఆఫ్ రికార్డ్స్ లెక్కల ప్రకారం తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఏడేళ్లలో రాష్ట్రంలో 7,409 మంది రైతులు సూసైడ్ చేసుకున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నారని రైతు సంఘాల అంచనా.