తెలంగాణ పీసీసీ కొత్త చీఫ్ ఎంపిక కోసం కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తున్న వేళ.. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఏం చేసినా హాట్ టాపిక్‌గా మారిపోతోంది. అధ్యక్ష రేసులో రేవంత్ రెడ్డి ప్రముఖంగా ఉండటంతో ఆయన వేసే ప్రతీ అడుగును..అదే పదవిని ఆశిస్తున్న సీనియర్లు అనుమానంగా చూస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి తాజాగా ఢిల్లీ వెళ్తుండటం వారిని తీవ్రంగా కలవరపెడుతోంది.
వాస్తవానికి రేవంత్ రెడ్డి డిఫెన్స్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన ప్రస్తుతం ఎంపీగా ఉన్న మల్కాజిగిరి ప్రాంతం కంటోన్మెంట్ ఏరియా కావడంతో.. అక్కడి సమస్యలపై చర్చించేందుకు రావాలని ఆయన్ను ఆహ్వానించారు. అయితే ఇదే సమావేశానికి రాహుల్ గాంధీ కూడా హాజరయ్యే అవకాశముంది. దీంతో పీసీసీ రేసులో ఉన్న నేతలు మాత్రం.. రేవంత్ రెడ్డి ఎక్కడ రాహుల్‌గాంధీతో సమావేశమై.. తమకు పీసీసీ పదవి రాకుండా అడ్డుపడతారేమోనని తెగ ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ సమావేశానికి రాహుల్ హాజరయ్యే విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు. అలాగే రేవంత్ రెడ్డి కూడా రాహుల్‌గాంధీ అపాయింట్‌మెంట్ ఏదీ కోరలేదని తెలుస్తోంది.
అటు ఇప్పటికే రాష్ట్ర నేతలెవరూ ఢిల్లీ రావొద్దని అధిష్టానం స్ట్రిక్ట్‌గా చెప్పినప్పటికీ.. కొందరు వాటిని ఖాతరు చేయకుండా హస్తినకు పయనమవుతున్నారు. సొంత పనిమీద వెళ్తున్నామంటూ.. ఢిల్లీ ఫ్లైట్ ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లేందుకు రాష్ట్ర ఇంచార్జీ మణికం ఠాగూర్ దగ్గర అనుమతి తీసుకున్నారని తెలిసింది. అయితే తనకు సమాచారం ఇవ్వకుండా ఎవరూ కూడా అధిష్టానంతో సంప్రదింపులు చేసే ప్రయత్నం చేయవద్దని.. ఠాగూర్ ఇప్పటికే పార్టీ నేతలందరికీ గట్టిగా చెప్పారని అంటున్నారు. ఏమైనా.. తెలంగాణ పీసీసీ ఎంపికలో ప్రతీ పరిణామం ఉత్కంఠ రేపుతూనే ఉంది.