ఎన్టీఆర్, పీవీ ఘాట్‌లను కూల్చివేయాలంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలతో గ్రేటర్ ఎన్నికల రాజకీయం మరింత వేడెక్కింది. ఎన్టీఆర్, పీవి ఘాట్లకు తాను రక్షణగా ఉంటానంటూ మాట్లాడిన బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్‌కు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సూటి ప్రశ్నలు సంధించారు. పీవీ, ఎన్టీఆర్ ఘాట్‌లను కాపాడతామని బండి సంజయ్ చెప్పడం సంతోషకరమేనని కానీ.. ఘాట్‌ల కంటే ముందు వారి ఔనత్యాన్ని కాపాడే ప్రయత్నం బీజేపీ ఎందుకు చేయడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
తెలుగు జాతి ఖ్యాతిని దేశమంతా చెప్పుకునేలా చేసిన ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని ప్రజలు, ప్రభుత్వం, పార్టీలకతీతంగా ఎందరో నేతలు.. ఎప్పటి నుంచో కోరుతున్నారన్న విషయాన్ని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి.. ఎన్టీఆర్‌పై అంత గౌరవమే ఉంటే మోదీతో మాట్లాడి పెండింగ్‌లో భారతరత్న ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. పీవీకి భారత రత్న ఇచ్చేందుకు కూడా మోదీ ప్రభుత్వానికి మనసు ఎందుకు రావడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ఎన్టీఆర్ కాషాయ వస్త్రాలు ధరించి పాలన చేశారని, పీవీ అయోధ్య విషయంలో స్ఫూర్తిదాయక పాత్ర పోషించారని కొనియాడుతున్న బండి సంజయ్… నిజంగానే తానలా భావిస్తే వెంటనే కేంద్రానికి లేఖ రాసి వారికి భారతరత్న ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. ఓట్ల కోసం లేని ప్రేమను ఒలకబోయొద్దని హితవు పలికారు.