ఆలస్యం అమృతం విషం అంటారు పెద్దలు. రాజకీయాల్లో సమయస్ఫూర్తి చాలా అవసరం. ఏ విషయంలో అయినా సరే… ఆలస్యం చేసినా, తొందరపడినా ఫలితాలు తిరగబడతాయి. 2018లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లినప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం.. అభ్యర్థుల ఎంపికలో ఆలస్యం చేసి భారీ మూల్యం చెల్లించుకుంది. కేసీఆర్ నాలుగున్నరేళ్ల పాలనపై ఉన్న అసంతృప్తిని కొంచెం కూడా క్యాష్ చేసుకోలేక ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
పొత్తుల పేరుతో కాలయాపన చేయడంతో.. ప్రచారానికి సమయం కూడా సరిపోక కాంగ్రెస్ అభ్యర్థులు చేతులెత్తేశారు. ఆ తర్వాత దుబ్బాక, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లోనూ పా పంథాలోనే వెళ్లి కాంగ్రెస్ బోల్తాపడింది. సమయానుకూల నిర్ణయాలు లేకపోవడంపై పార్టీ శ్రేణులు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. కొత్త నాయకత్వాన్ని బలంగా కోరుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చినా… పార్టీ తీరు మారకపోవడం చర్చనీయాంశంగా మారింది.
హుజురాబాద్ ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ నాయకత్వం మీనమేషాలు లెక్కపెట్టడం కార్యకర్తలకు చిరాకు తెప్పిస్తోంది. అభ్యర్థి ఎవరో తేల్చేందుకు రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసినా.. అది ఇంకా ఏ నిర్ణయం తీసుకోకపోవడంపై పెదవి విరుస్తున్నారు. పార్టీ గెలుస్తుందో, లేదో తర్వాత సంగతి కానీ.. అభ్యర్థి ఎంపిక చేయడంలోనూ ఇంత ఆలస్యం ఏమిటని వారు కమిటీని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇలాంటి చర్యలతోనే పార్టీ నష్టపోయిందని.. కొత్త నాయకత్వం వచ్చినా అదే జరిగితే ఎలా అని అడుగుతున్నారు. ఇంకా ఆలస్యం చేస్తే.. నిజంగానే కాంగ్రెస్, బీజేపీ కలిసిపోయాయేమోనన్న అనుమానాలు ప్రజల్లో కలుగుతాయని, వెంటనే అభ్యర్థిని తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు.