బీజేపీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. బండి సంజయ్ , కిషన్ రెడ్డి పేపర్ పులుల్లాగా టీవీల ముందు రంకెలేయొద్దన్నారు. కేసీఆర్ అవినీతిపై తాను ఫిర్యాదు చేశానన్నారు. కానీ దానిపై ఇప్పటి వరకు ఎందుకు విచారణ చేపట్టలేదు? అని ఆయన ప్రశ్నించారు.
కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ప్రధాని, కేంద్ర మంత్రులు చెప్పారని పేర్కొన్నారు. అయినా కేసీఆర్ అవినీతిపై ఎందుకు విచారణ చేపట్టలేదని ఆయన అడిగారు. ఈడీ, సీబీఐ బీజేపీ జేబు సంస్థలుగా మారాయన్నారు. లిక్కర్ స్కాం కేసులో ఏం జరుగుతుందో ఈడీ అధికారులు ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదన్నారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా పట్ల వ్యవహరించిన విధంగా లిక్కర్ కేసులో కవిత పట్ల ఎందుకు వ్యవహరించడంలేదు? అని ఆయన మండిపడ్డారు. ఇదంతా ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారని తెలిపారు. అవినీతి ఆరోపణలు రాగానే రాజయ్యను సీఎం కేసీఆర్ బర్తరఫ్ చేశారన్నారు.
మరి ఇప్పుడు ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితపై మాత్రం కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని ఆయన ప్రశ్నలు గుప్పించారు. ఈ ఇష్యూపై మౌనంగా ఉంటున్న కేసీఆర్ బండి సంజయ్ కు కనిపించడం లేదా? అని ఆయన ప్రశ్నించారు.