రాహుల్ గాంధీపై బీజేపీ చిల్లర ఆరోపణలు చేస్తోందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఇందిరా భవన్ లో టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడారు రేవంత్. గతేడాది సెప్టెంబర్ 7న రాహుల్ గాంధీ ఒక ఉక్కు సంకల్పంతో భారత్ జోడో యాత్ర చేపట్టారని అన్నారు. కోట్లాది మందిని కలుస్తూ వారికి భరోసాను ఇస్తూ ముందుకెళ్తున్నారని చెప్పారు.
దేశ సమగ్రతను కాపాడేది కాంగ్రెస్ అని ప్రజలకు రాహుల్ గాంధీ ఒక నమ్మకాన్ని కలిగించారన్నారు రేవంత్. ఎండ, వాన, చలి.. అన్ని పరిస్థితులను తట్టుకుని ముందుకు సాగారని తెలిపారు. బీజేపీ ఆలోచనా విధానం ఆపార్టీ నేతల మాటల్లోనే వ్యక్తం అవుతోందని మండిపడ్డారు. ఎన్నో అడ్డంకులు దాటుకుని జోడో యాత్ర విజయవంతమైందని చెప్పారు.
ప్రతీ గుండెకు రాహుల్ గాంధీ సందేశాన్ని చేరవేసేందుకే హాత్ సే హాత్ జోడో యాత్ర చేపడుతున్నట్లు చెప్పారు రేవంత్ రెడ్డి. జోడో యాత్రకు కొనసాగింపుగానే ఇది ఉంటుందన్నారు. భద్రతా కారణాలు చూపి జనవరి 26న రాహుల్ గాంధీ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని వివరించారు.
శ్రీనగర్ లో జెండా ఎగురవేయకుండా కుట్రపూరితంగా అడ్డుకుంటున్నారని చెప్పారు. కానీ, జెండా ఎగురేసి తీరాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారని తెలిపారు. జనవరి 26కు బదులుగా 30న శ్రీనగర్ లో రాహుల్ జాతీయ జెండా ఎగురవేస్తారన్నారు రేవంత్ రెడ్డి.