కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బొందల గడ్డగా మారిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
హన్మకొండలో ఆయన ఈ రోజు పాదయాత్ర చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఓరుగల్లు నీవురుగప్పిన నిప్పులా ఉందన్నారు. ఎనుమాముల మార్కెట్ దళారుల పాలైందని రైతులు తమ గోడును తనకు వినిపించారని చెప్పారు.
వరంగల్ ఏకశిల పార్కు తాగుబోతుల అడ్డాగా మారిందని ఆరోపించారు. కాళోజీ కళా క్షేత్రం మొండిగోడలతో నిలబడ్డదన్నారు. కేసీఆర్ కట్టిస్తామన్న డబుల్ బెడ్రూం ఇళ్లు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, ఇండ్ల ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు.
తొమ్మిదేళ్లయినా అమరుల స్థూపం నిర్మాణం పూర్తికాలేదన్నారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ఇప్పటికీ పూర్తికాలేదన్నారు. ఆ దయాకర్ ఏక్ నెంబర్ అయితే ఈ దయాకర్ దస్ నెంబర్ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ హామీలు చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంటాయన్నారు.
కానీ ఏ ఒక్క హామీని నేరవేర్చలేదన్నారు. పార్టీ కోసం కష్టపడేవారికి చేయాల్సిన సమయంలో చేయాల్సినవన్నీ సోనియమ్మ చేస్తుందని ఆయన తెలిపారు. పార్టీ కోసం జెండా మోసిన కార్యకర్తలను ఆదుకునే కార్యాచరణను తాము తీసుకువస్తామన్నారు.
బిల్లా రంగా ల్లా బీఆరెస్ ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంతా ఒక దండుపాళ్యం ముఠా అని ఫైర్ అయ్యారు. దండుపాళ్యం ముఠాకు హన్మకొండ సాక్షిగా హెచ్చరిక చేస్తున్నాన్నారు. దండుపాళ్యం ముఠాకు ఇంతకింత మిత్తితో సహా చెల్లిస్తామన్నారు.
రోజులు లెక్కపెట్టుకోండి, గోడమీద రాసి పెట్టుకోండి అంటూ ఆయన హెచ్చరించారు. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయన్నారు. అధికారులు నిబంధనలకు లోబడి పనిచేయాలని సూచించారు.
లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంలో చర్యలు తప్పవన్నారు.