సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి దళితున్ని చేస్తానన్నారని, కానీ దరిద్రుడు ముఖ్యమంత్రి అయ్యాడని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికలకు ఎనిమిది నెలలు మాత్రమే మిగిలిందన్నారు.
బీఆర్‌ఎస్ నాయకులు గ్రామాల్లోకి రాకతప్పదన్నారు. వాళ్లని దళితులు పాతాళానికి తొక్కుతారన్నారు. బిజినపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో దళిత గిరిజన ఆత్మగౌరవ సభను నిర్వహించారు. ఆ సభకు హాజరై ఆయన మాట్లాడుతూ….
నిజాం దాష్టిక పాలనను, దొరల అరాచకాలకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర పాలమూరు ప్రజలదన్నారు. మార్కెండేయ ప్రాజెక్టు రిజర్వాయర్ పనులను పరిశీంచడానికి నాగం జనార్దన్ రెడ్డి వెళ్లారన్నారు. అంతేకానీ ఎవరి సొత్తు గుంజుకోడానికి వెళ్లలేదన్నారు.
పాలమూరు రంగారెడ్డితో పాటు కల్వకుర్తి, బీమా, నెట్టంపాడు, కొయిల్ సాగర్ ప్రాజెక్టులను కాంగ్రెస్ హయాంలో చేపట్టినవేనన్నారు. మేము కట్టిన ప్రాజెక్టులను మీరు కట్టామని పేరు పెట్టుకుంటారా..? అంటూ మండిపడ్డారు. పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులు ఎవరు కట్టారో చర్చకు తాము సిద్దమన్నారు. చర్చకు బీఆర్ఎస్ నేతలు సిద్దమా..? అని సవాల్ విసిరారు.
అమెరికాలో నల్లజాతీయులను తొక్కాలని చూస్తే ట్రంప్‌నే పాతాళానికి తొక్కారన్నారు. నాడు నాగం జనార్దన్ రెడ్డి సంగతి చూస్తానన్న గాలి జనార్దన్ రెడ్డి చివరకు జైలు పాలయ్యాడన్నారు. నాగంతో పెట్టుకుంటే ఆయనకు పట్టిన గతే పడుతుందని ఆయన అన్నారు.
మాణిక్ రావు ఠాకూర్ వచ్చారని, తమలో ఎలాంటి తగాదాలు లేవన్నారు. ఇక మీ అంతు చూడటమే తమ వంతన్నారు. దళిత బిడ్డ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను అణగ తొక్కెందుకు యత్నించారని ఆయన ఆరోపించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలను గెలిచి చూపిస్తామన్నారు.