రాష్ట్రంలో అన్ని సమస్యలు తీరాలంటే కేసీఆర్ పోవాలి, కాంగ్రెస్ రావాలి అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రగతి భవన్‌ను డాక్టర్ బీఆర్ అంబెడ్కర్ నాలెడ్జ్ సెంటర్‌గా మారుస్తామని ఆయన పేర్కొన్నారు. అక్రమాలు చేసే అధికారులను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కటకటాల్లో వేస్తాం.
తెలంగాణలో రాక్షస పాలన అందిస్తూ, దోపిడీలు చేస్తూ పాపాల భైరవుడైన కేసీఆర్‌ను పాతాళానికి తొక్కేందుకే ఈ యాత్ర చేపట్టినట్టు చెప్పారు. డోర్నకల్‌లో 14 సార్లు ఎన్నికలు జరిగితే 12 సార్లు ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరేసిందన్నారు. డోర్నకల్‌కు రెడ్యానాయక్ నయా జమిందారుగా మారారని మండిపడ్డారు.
ఈ రోజు నియోజకవర్గంలో ఈ పరిస్థితి కారణం రెడ్యానాయక్ కుటుంబమేనన్నారు. అందుకే రాబోయే ఎన్నికల్లో రెడ్యానాయక్ కుటుంబాన్ని ఓడించాలని తమ యువకులు ఇక్కడకు వచ్చారన్నారు. రూ. 500 కోట్ల విలువైన ఐదేకరాల భూమి ఎంపీ కవితకు మియాపూర్ లో ఎలా వచ్చింది? అని ఆయన ప్రశ్నించారు.
ఈ భూమిని బదిలీ చేయడానికి రెడ్యా నాయక్‌ను ఆయన కూతురు పార్టీ మార్పించిందన్నారు. కూతురు భూ దాహం కోసమే రెడ్యా నాయక్ పార్టీ మారారని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై చర్చకు రావాలని ఎంపీ కవితకు ఆయన సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఐకేపీ సంఘాలకు దిక్కులేదన్నారు
కేసీఆర్ తన గడీని తొమ్మిది నెలల్లో కట్టుకున్నారని, కానీ నాలుగేండ్లయినా డబుల్ బెడ్రూం ఇళ్లు పూర్తి చేయలేదని ఫైర్ అయ్యారు. అలాంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కాల్సిన అవసరం ఉందన్నారు. నిన్న మహబూబాబాద్ లో తాను చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే, ఎంపీలు మాట్లాడటలరటని చెప్పారు.
కనుసైగ చేస్తే నన్ను ఏదో చేస్తారని వారన్నారని, కేటీఆర్ కాదు.. ఏట్లో రావులందరిని తీసుకుని రండి అని మరిపెడ చౌరస్తాలో నెత్తిమీద కాలు పెట్టి తొక్కుతా అని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ప్రగతి భవన్ లో ప్రజలకు ఎందుకు ప్రవేశం లేదు..? అని ఆయన ప్రశ్నించారు. ప్రగతి భవన్ గూడుపుటాని ఏంది?.. అందులో వేల కోట్ల కథ ఏందీ? అని ఆయన అడిగారు. పేదల చెమట వాసనకంటే కాంట్రాక్టర్ల సెంటు వాసన కేసీఆర్ కు ఇంపుగా ఉందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ ప్రగతి భవన్ గేట్లు బద్దలుకొడతామన్నారు. ఎన్ని వందల కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండని చెప్పారు. కేసీఆర్ శాశ్వతం అనుకున్న గడీపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామన్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రగతి భవన్ ను డాక్టర్ బీఆర్ అంబెడ్కర్ విజ్ఞాన కేంద్రంగా మారుస్తామన్నారు.
పోలీసులను నమ్ముకుని తాను పాదయాత్ర చేయడం లేదన్నారు. తమ కార్యకర్తలను నమ్ముకుని తాను యాత్ర చేస్తున్నానన్నారు. కాంగ్రెస్ పార్టీ గడీల పాలనకు వ్యతిరేకమన్నారు. అటవీ ప్రాంతంలో గిరిజన, ఆదివాసులకు 2006లో కాంగ్రెస్ 10లక్షల ఎకరాల పంపిణీ చేసిందన్నారు.
అసైన్డ్, పోడు భూములు కలిపి దాదాపుగా 35 లక్షల ఎకరాల భూములను కాంగ్రెస్ పంచిందన్నారు. గిరిజనులను భూమి యజమానులను చేసింది కాంగ్రెస్ అని వెల్లడించారు. భూమి అంటే తల్లితో సమానమన్నారు. 1969 లో తెలంగాణ ఉద్యమం భూములకోసమే జరిగిందన్నారు.
రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ నిజాం నుంచి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను డ్రామారావు, మిత్ర బృందం కొల్లగొట్టిందన్నారు. తనపై ఏ ఆరోపణ ఉన్నా సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమన్నారు. ఈ ప్రభుత్వంపై తాను చేస్తున్న ఆరోపణలపై కేటీఆర్ సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు.
నిషేధిత జాబితాలో చేర్చిన భూముల్లో ఎన్నివేల ఎకరాలను ఆ జాబితా నుంచి తొలగించారని అడిగారు. వాటిని ఎవరెవరి పేర్ల మీద బదలాయించారో బయటపెట్టాలన్నారు. అమెరికన్ కంపెనీని బెదిరించి తెల్లపూర్ లో ప్రతిమా శ్రీనివాస్ పేరుమీద 5వేల కోట్ల విలువైన భూములను బదలాయించిందన్నారు. అందులో కేటీఆర్ కు భాగస్వామ్యం ఉందన్నారు. డ్రామారావు వేల కోట్ల భూ కుంభకోణానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.
కేసీఆర్ నీ కొడుకు చేసే భూ దందాలు కనిపించడం లేదా? అని అడిగారు. దృతరాష్టుడిలా కేసీఆర్ కళ్లు మూసుకున్నారా? అని ఆతగ్రహం వ్యక్తం చేశారు. శాసన సభలో సభ్యుడు లేనప్పుడు పేరు ప్రస్తావించ కూడదన్న కనీస జ్ఞానం కేటీఆర్ కు లేదన్నారు. తాను అక్కడ ఉంటే సమాధానం ఇచ్చే వాడినన్నారు.