కేసీఆర్ లాంటి దుష్టశక్తి నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించాలని దేవుడిని కోరుకోవాలని ప్రజలకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సూచించారు. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీలపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కుటుంబ తగాదాలను పరిష్కరించుకోవడానికి, రాజకీయ దురాశలతోనే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టాడని ఆయన మండిపడ్డారు.
గడిచిన దశాబ్ద కాలంలో తెలంగాణ పేరుతో కేసీఆర్ ఆర్థికంగా బలోపేతమయ్యారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు కాలం చెల్లిందన్నారు. ఎక్కడా తెలంగాణ అనే పదం వినిపించకుండా కేసీఆర్ కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు.
ప్రజలను మభ్య పెట్టేందుకే బీఆర్ఎస్ పేరిట జాతీయ పార్టీ పెట్టారని ఫైర్ అయ్యారు. ఆ తరువాత ప్రపంచ రాష్ట్ర సమితిని కేసీఆర్ పెట్టినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ అస్థిత్వాన్ని కేసీఆర్ చంపేశారని ఆయన ఆరోపణలు చేశారు.
కేసీఆర్ దుర్మార్గపు ఆలోచనలను ఓ తెలంగాణ బిడ్డగా తాను ఖండిస్తున్నానని చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో పోటీ చేయడానికి కూడా సీఎం కేసీఆర్ కు అర్హత లేదన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రజలు ఆలోచించాలన్నారు.
కేసీఆర్ లాంటి దుష్టశక్తి నుంచి తెలంగాణకు విముక్తి కలిగించాలని దేవుడిని కోరుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ విషయాన్ని దసరా జమ్మి చెట్టు పూజల్లో కాగితంపై రాసి పెట్టండన్నారు. తాను కూడా జమ్మి చెట్టు పూజలో కాగితంపై ఆ విషయాన్ని రాసి దేవున్ని కోరుకుంటానన్నారు.