ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా సింగిరెడ్డి పాలెం గురుకుల హాస్టల్, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ట్రైబల్ వేల్ఫేర్ హాస్టల్ లోని విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటనపై ఆయన సీరియస్ అయ్యారు. మంగళవారం ట్విట్టర్ లో స్పందించిన రేవంత్ రెడ్డి.. విలాసవంతమైన భవనాల్లో ఉంటున్నారని విమర్శించారు.
విద్యార్థులకు పెట్టే అన్నంలో నిత్యం పురుగులు, ఉంటున్న హాస్టల్లో ఎలుకల గాట్లు.. ఇదేనా బంగారు తెలంగాణ? అంటూ ప్రశ్నించారు. ఈ సంఘటనలు చూస్తుంటే తన రక్తం ఉడుకుతోందని.. అసలు ఈ పాలకులు మనుషులేనా? అని నిలదీశారు. కాగా సింగిరెడ్డి పాలెంలోని మహాత్మా జ్యోతి రావు పూలే బాలికల గురుకుల హాస్టల్ల లో నిద్రిస్తున్న విద్యార్థినులను ఎలుకలు కొరకడంతో 10 మంది గాయపడ్డారు.
కొంత మందికి అరికాళ్లలో చర్మం ఊడిపోయింది. ఎలుకల వల్ల నిత్యం తాము ఇబ్బందులు పడుతున్నామని, నిద్ర కూడా పోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ట్రైబుల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్ లో ఆదివారం రాత్రి ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. నిద్రిస్తున్న ఏడుగురు విద్యార్థుల పై ఎలుకలు దాడి చేశాయి. ఈ సంఘటనలకు సంబంధించిన వార్త కథనాలను రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో షేర్ చేశారు. ప్రుభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో నిత్యం ఏదో ఓ సమస్య వెలుగు చూస్తుండటం పై విద్యా రంగ నిపుణులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.