– హాజరైన హస్తం కీలక నేతలు
– చీఫ్ గెస్ట్ గా హిమాచల్ ప్రదేశ్ సీఎం
– పాలమూరు బిడ్డలను నిరాశ్రయులను చేశారు
– రాష్ట్రం ఇచ్చింది గొర్రెలు కాసుకోడానికా?
– పాలమూరు అభివృద్ధిని అడ్డుకుంది కేసీఆర్ కాదా?
– బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా జడ్చర్లలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్, ఏఐసీసీ ఇంఛార్జ్ సెక్రటరీ మాణిక్ రావు థాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ సహా ఇతర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంతో మంది పరిపాలనా దక్షకులు పాలమూరు జిల్లా నుంచి ఉద్భవించారన్నారు.
కృష్ణానది ఉప్పొంగి ఆలంపూర్ అతలాకుతలమైనప్పుడు ఏటి గడ్డ ప్రాంత రైతులకు బంజారాహిల్స్ లోని తన బంగ్లాను అమ్మి ఇళ్లు కట్టిస్తానని సీఎం కేసీఆర్ అన్నారని చెప్పారు. తెలంగాణ వచ్చాక పాలమూరును అభివృద్ధి చేస్తానని చెప్పారని గుర్తు చేశారు. వలస వచ్చినోన్ని మనం ఆదరిస్తే వలసపోతున్న మనను కేసీఆర్ తిరస్కరించి నిరాశ్రయులను చేసిండని విమర్శించారు.
రాష్ట్రం ఇచ్చింది యాదవులు గొర్రెలు పెంచుకోవడానికి, గౌడన్నలు ఈదులు గీసుకోవడానికా అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం రాజ్యాలు ఏలితే… బడుగు బలహీనవర్గాల బిడ్డలు కులవృత్తులు చేసుకోవాలా? అని ప్రశ్నించారు.
పాలమూరు అభివృద్ధిని సీఎం కేసీఆర్ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు రేవంత్. పాలమూరులో 10లక్షల ఎకరాలను ఎడారి చేసే హక్కు కేసీఆర్ ఎవరు ఇచ్చారు? అని మండిపడ్డారు.
కేసీఆర్ చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా పాలమూరు ప్రజల రుణం తీర్చుకోలేరు. తులసి వనంలో గంజాయి మొక్కలాగా పాలమూరు అభివృద్ధిని కేసీఆర్ అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ పాలమూరు పాలిట శనిలా, శకునిలా తయారయ్యారు. పాలమూరు అభివృద్ధి జరిగింది కాంగ్రెస్ హయాంలో జరిగిందేనన్నారు. దీనిపై చర్చించేందుకు ఎక్కడికైనా వస్తామని, దమ్ముంటే బీఆర్ఎస్ నేతలు రావాలని ఛాలెంజ్ చేశారు రేవంత్.
ఇక భట్టి విక్రమార్క మట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీని తప్పుడు కేసు పెట్టి జైలు శిక్ష పడేలా చేసి లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయించారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారిని శిక్షిస్తామనే అప్రజాస్వామికమైన పాలన కొనసాగుతోందన్నారు. దేశంలో భావ స్వేచ్ఛ లేదని.. తెలంగాణలోనూ అదే పరిస్థితి నెలకొందని విమర్శించారు.
స్వేచ్ఛ లేదు, ఆత్మ గౌరవం లేదు, మా కొలువులు అనే పదానికి అర్థమే లేకుండా పోయిందని మండిపడ్డారు భట్టి.
తెలంగాణ ప్రజలు 70 ఏండ్ల రాష్ట్రం కోసం పోరాటం చేశారని సీఎం సుఖ్విందర్ సింగ్ సుక్కు అన్నారు. రాష్ట్రం కోసం 1500 మంది ఆత్మ బలిదానం చేశారని పేర్కొన్నారు. ఈ క్రమంలో 2014లో తెలంగాణ ఇవ్వాలని సోనియాను ఇక్కడి కాంగ్రెస్ ఎంపీలు కోరారని చెప్పారు. ప్రజాభీష్టం మేరకు సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని.. ప్రజలు ఆమె రుణం తీర్చుకోవాలని కోరారు.