మంత్రి ప్రశాంత్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్‌కు కట్టు బానిసైన ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ యువతకు గంజాయి అలవాటు చేస్తున్నారంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రశాంత్ రెడ్డి సర్పంచ్ కు ఎక్కువ, ఎంపీటీసీకి తక్కువ అంటూ ఆయన ఫైర్ అయ్యారు.
నిజామాబాద్ జిల్లా ఏర్గట్లలో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. తాము రైతులతో సమావేశం పెడితే అక్కడికి రావద్దని వారిని బీఆరెస్ సన్నాసులు బెదిరించారట అని ఆయన మండిపడ్డారు.
పోలీసులకు చెప్పి కేసులు పెడతామని రైతులను భయపెట్టారని, అయినప్పటికీ రైతులు భయపడకుండా సమావేశానికి హాజరయ్యారని చెప్పారు. ఇక్కడి అన్నదాతలు హర్యానా రైతుల స్పూర్తితో హక్కులు సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఉమ్మడి రాష్ట్రంలో చెరుకు పరిశ్రమలు నడిపించారన్నారు. కానీ తెలంగాణ వచ్చాక కేసీఆర్ ఇక్కడి చక్కెర పరిశ్రమను మూసేశారన్నారు. కవితను ఓడించి కల్వకుంట్ల కుటుంబాన్ని పాతరేసిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉందన్నారు. పసుపు బోర్డు తెస్తానని ఇక్కడి రైతులను ఎంపీ అరవింద్ మోసం చేశారన్నారు.
బాండ్ పేపర్ ఇచ్చి మాట తప్పిన అరవింద్‌ను పొలిమేరలకు తరమాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదన్నారు. పదేళ్లు కేసీఆర్ అధికారంలో ఉన్నారని పేర్కొన్నారు. 2024 నుంచి 2034 వరకు ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు.
కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే డైరీ రాసి పెట్టండన్నారు. అధికారంలోకి వచ్చాక మిత్తితో సహా చెల్లిద్దామని చెప్పారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌లో డబుల్ బెడ్రూంలు ఇచ్చారని, కానీ ఇక్కడి ప్రజలకు డబుల్ ఇల్లు ఎందుకు ఇవ్వరు? అని ఆయన ప్రశ్నించారు. ఓట్లు వేసిన ప్రజలకు డబుల్ బెడ్రూం ఇవ్వని దద్దమ్మ మంత్రి ప్రశాంత్ రెడ్డి అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇంత అధ్వాన్నమైన రోడ్లు తాను ఎక్కడా చూడలేదన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయని ఈయనేం మంత్రి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వేదిక సాక్షిగా ప్రశాంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నాన్నారు. 2018లో 62 కోట్లతో అమరవీవీరుల స్థూపం కడతామన్నారని గుర్తు చేశారు.
ఐదేళ్లలో బడ్జెట్ 200 కోట్లకు పెరిగిందన్నారు. ఇందులో రూ. 50కోట్లు ప్రశాంత్ రెడ్డి కమీషన్లు దండుకున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అమరవీరుల స్థూపం కాంట్రాక్టర్, వాచ్ మెన్ అందరూ ఆంధ్రావాళ్లే ఉన్నారన్నారు. అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, సచివాలయం కాంట్రాక్టులపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.