ప్రగతి భవన్ లో ఇటుక.. ఇటుక పీకేస్తామన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రాజ్యాంగాన్ని కాపాడుకుందామంటూ గాంధీ భవన్ లో ఎస్సీ సెల్ చేపట్టిన 48 గంటల దీక్షను విరమింపజేశారు. ఛైర్మన్ ప్రీతంతో పాటు పలువురికి నిమ్మరసం ఇచ్చి దీక్ష ముగింపజేశారు. ఏఐసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్ రాజీవ్ లిలోతియా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. కేసీఆర్ మాటలు, నరేంద్ర మోడీ ఆలోచనలు, బీజేపీ కుట్రను నిశితంగా గమనించాలని ప్రజలకు సూచించారు.
చైనాలో 68 సంవత్సరాలకు రాజకీయ నాయకులు రిటైర్డ్ కావాలి.. రెండుసార్లకు ఎక్కువ అధ్యక్షుడు కాలేరన్నారు రేవంత్. కానీ.. 2018లో జిన్ పింగ్ రాజ్యాంగాన్ని సవరణ చేసి శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకొని రాచరికపు రాజ్యాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అలాగే రష్యాలో 2036 వరకు పుతిన్ అధ్యక్షుడిగా ఉండేలా సవరణ చేసుకున్నారని వివరించారు. ఇక ఉత్తర కొరియాలో ప్రశ్నించడం.. వేరే పార్టీ ఉండడం జరగదని తెలిపారు. మోడీకి పుతిన్, జిన్ పింగ్ ఆదర్శమైతే.. కేసీఆర్ కి కిమ్ ఆదర్శమని అన్నారు.
భారత రాజ్యాంగ స్ఫూర్తి ప్రపంచ దేశాలకు తెలుసు గానీ.. కేసీఆర్ ఆయన మిత్రుడు మోడీకి అర్థం కావడం లేదన్నారు రేవంత్. రాజ్యాంగంపై కేసీఆర్ మాటల తరువాత ట్యాంక్ బండ్ దగ్గరున్న అంబేద్కర్ విగ్రహం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్తారని అనుకున్నట్లు తెలిపారు. కేశవరావు, కడియం శ్రీహరి లాంటి వాళ్లు పదవుల కోసం కేసీఆర్ కాళ్ల దగ్గర నిలబడాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు. కేశవరావు విజ్ఞానం ఏమైంది.. ఆయన ఆలోచనలకు కరోనా వచ్చిందా? అంటూ సెటైర్లు వేశారు. కడియం శ్రీహరి ఆలోచనలకు గౌరవం ఉందా? అని అడిగారు. కేసీఆర్ ఆలోచనా విధానాన్ని కేశవరావు మాటలను రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే ఖండించారని చెప్పారు.
కేసీఆర్ మీద కేసులు పెట్టాల్సిన బీజేపీ ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు రేవంత్. ఉభయ సభల్లో ఎంపీలు కేసీఆర్ కు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడడం లేదని మండిపడ్డారు. రాజ్యాంగం లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదన్న ఆయన.. అదే రాజ్యాంగం వల్ల రెండుసార్లు కేసీఆర్ సీఎం అయ్యారని గుర్తు చేశారు. కేసీఆర్ మాటల వెనుక పెద్ద కుట్ర ఉందని.. నరేంద్ర మోడీ సూత్రధారిగా కేసీఆర్ పాత్రధారిగా ఉన్నారని ఆరోపించారు. శనివారం అన్ని జిల్లాల్లో, పోలీస్ స్టేషన్లలో కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులపై ఫిర్యాదులు చేస్తామని తెలిపారు. ఆదివారం అన్ని అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి పూజలు చేయాలని మహిళా కాంగ్రెస్ పిలుపునిచ్చారు. సీతక్క, గీతక్క నాయకత్వంలో తామంతా ట్యాంక్ బండ్ దగ్గర పాలాభిషేకం చేస్తామన్నారు రేవంత్. అలాగే సోమవారం పార్లమెంట్ బయట రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో మాట్లాడి కోమటిరెడ్డి, ఉత్తమ్ తో కలిసి దీక్ష చేస్తామని చెప్పారు. పార్లమెంట్ లో కేసీఆర్ పై నిరసన వ్యక్తం చేస్తామన్న ఆయన.. ఇంకోసారి రాజ్యాంగం మీద మాట్లాడితే రాళ్లతో కొట్టిస్తామని హెచ్చరించారు.