దళిత బంధు సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగంపై తీవ్రస్థాయిలో స్పందించారు తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. దళితులకు క్షమాపణ చెప్పి కేసీఆర్ హుజురాబాద్ సభలో ప్రసంగం మొదలుపెడతారని అనుకున్నానని.. కానీ నిజం చెబితే తల పగిలి చనిపోయే శాపం కేసీఆర్‌కు ఉందని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నిక కోసం కేసీఆర్ చాలా దిగజారిపోయాడని విమర్శించారు. దళిత బంధు గురించి తన భార్య శోభమ్మతో చర్చించానని చెప్పి ఆమెను కూడా అవమానించారని అన్నారు. తన పాపాల్లో భార్యను కూడా భాగస్వామ్యం చేస్తున్నారని ఆరోపించారు. తన భార్యను అవమానించిన ఆయన.. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం కేసీఆర్ కొంగ జపం చేస్తున్నారని సెటైర్ వేశారు రేవంత్ రెడ్డి. దళితులను ఉద్యమంలో వాడుకుని.. ఆతర్వాత దళితులకు పాలించడం రాదని మోసం చేశారని ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహం పెడతానని చెప్పి.. తట్ట మట్టి అయినా తీశారా అని నిలదీశారు. కేసీఆర్ ఏనాడూ అంబేద్కర్ జయంతి, వర్ధంతి రోజుల్లో పూలమాల కూడా వేయలేదని విమర్శించారు. దళితులపై దాడులు జరుగుతుంటే ఒక్క రోజైన కేసీఆర్ మాట్లాడారా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఇసుక మాఫియాను ప్రశ్నించిన నేరేళ్ల దళితులను విచ్చలవిడిగా కొట్టించారని.. ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్‌ది అని మండిపడ్డారు.
కేసీఆర్ కుటుంబానికి ధన పిశాచి పట్టిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. కమీషన్ల కోసం ప్రాజెక్టుల పేరిట భారీ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు . మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం రీ డిజైన్ పై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎన్ని ఇళ్లల్లో నల్లాలు ఉన్నాయో చూద్దామా అని చాలెంజ్ చేశారు.