ఔను… వాళ్లిద్దరూ ఒక్కటే!
స్టేట్లో ఫైట్ ! సెంట్రల్లో రైట్ !!
గవర్నర్ తాజా వ్యాఖ్యలపై బీజేపీ మౌనం
టీఆర్ఎస్-బీజేపీ దోస్తీకి ఇదే నిదర్శనం.. అంటున్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి.
ఇంకా మీరేం చెబుదామనుకుంటున్నారో మీరే… చెప్పండి బాస్!
కాళేశ్వరం ప్రాజెక్టు మానవ నిర్మిత అద్భుతం.. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ఈ దేశానికే ఆదర్శం అని నూతన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వచ్చీరావడంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆకాశానికి ఎత్తేశారు. దూరదర్శన్ వేదికగా ఆవిడ చేసిన వ్యాఖ్యలు మనం చూశాం. గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించి 24 గంటలు కూడా గడవక ముందే రాష్ట్రంలో అభివృద్ధి గురించి గౌరవ గవర్నర్ గారికి ఈ స్థాయిలో అవగాహన రావడం ఒకింత ఆశ్చర్యమే! తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు తమిళిసై తమిళనాడు రాష్ట్ర బీజేపీ శాఖకు అధ్యక్షురాలిగా ఉన్న విషయం తెలిసిందే. తమ పార్టీ సభ్యురాలు అన్న ఉద్దేశంతోనే ఆవిడ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు. ఇక విషయానికి వద్దాం..
టీఆర్ఎస్ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలపై తామే పోరాటం చేస్తున్నట్టు, రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయం అన్నట్టు ఇటీవల బీజేపీ నేతలు ప్రజల్లో భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్ కొనుగోళ్లలో అవినీతిపై రెండేళ్ల క్రితమే నేను బయట పెట్టిన అంశాన్ని మళ్లీ తెర మీదకు తెచ్చి తామే దానిని వెలికి తీసినట్టు హడావుడి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని ఇదే బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండీ.. అవినీతిపై విచారణ చేపట్టగలిగే స్థితిలో ఉన్న బీజేపీ ఆ పని చేయకుండా కేవలం రాజకీయ ఆరోపణలతో సరిపెడుతూ వస్తున్న విషయం మనం చూస్తున్నాం.
కాళేశ్వరంలో భారీ అవినీతి అంటూ ఓ వైపు రాష్ట్ర బీజేపీ నేతలు వాదిస్తుంటే… నిన్నటి వరకు ఆ పార్టీ తమిళనాడు శాఖకు అధ్యక్షురాలిగా ఉన్న గవర్నర్ తమిళి సై మాత్రం కాళేశ్వరం అద్భుతం అని ప్రకటించారు. నీళ్లు, విద్యుత్ విషయంలో రాష్ట్ర ప్రజల సెంటిమెంట్‌ను కేసీఆర్ కరెన్సీ కట్టలుగా మార్చుకుంటుంటే, ఆయన అవినీతికి వత్తాసు పలికేలా గవర్నర్ వ్యాఖ్యలు ఉండటం శోఛనీయం. టీఆర్ఎస్‌తో బీజేపీ ఉత్తుత్తి ఫైట్ అని మేం మొదటి నుంచి చెబుతున్నాం. తమిళి సై తాజా వ్యాఖ్యలతో ఆ విషయం మరోసారి రుజువైంది. నేను కొట్టినట్టు చేస్తా… నువ్వు ఏడ్చినట్టు చెయ్యి అన్న సామెతకు తగ్గట్టుగా ఈ రెండు పార్టీల తీరు ఉంది.
టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాటం నిజమైతే గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై ఇప్పటికే ఆ పార్టీ అభ్యంతరం చెప్పి ఉండాల్సింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, అవగాహన లేకుండా మాట్లాడవద్దని గవర్నర్‌ను కోరి ఉండాల్సింది. లేదా కేసీఆర్ అవినీతికి నూతన గవర్నర్ వత్తాసు పలుకుతున్నారని కేంద్రానికి ఫిర్యాదు చేసైనా ఉండేవారు. అలాంటిదేమీ చేయకుండా బీజేపీ నేతలు మౌనంగా ఉండటం దేనికి సంకేతం!? గవర్నర్ వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ స్పందిస్తారేమోనని ఇప్పటి వరకు చూశాను. కానీ, ఆయన కూడా మౌనాన్నే ఆశ్రయించారు. కేసీఆర్ తప్పుదోవ పట్టించడం వల్ల గవర్నర్ అలా మాట్లాడారా లేక బీజేపీ ఇచ్చిన సమాచారంతోనే మాట్లాడారా అన్నది స్పష్టం కావాలి. టీఆర్ఎస్‌తో చీకట్లో దోస్తీ-వెలుగులో కుస్తీ అనడానికి డాక్టర్ లక్ష్మణ్ తాజా మౌనం నిదర్శనం. నిన్నటి వరకు కేసీఆర్‌పై దూకుడు ప్రదర్శించిన కె. లక్ష్మణ్ గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై స్పందించాలి. బీజేపీ మౌనంగా ఉన్నా కాంగ్రెస్ మాత్రం కేసీఆర్ అవినీతిని వదిలిబెట్టబోదు. కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్ల అవినీతిపై త్వరలోనే ఆధారాలను గవర్నర్‌ను కలిసి అందజేస్తాం. టీఆర్ఎస్‌తో ఉత్తుత్తి ఫైట్ చేస్తూ… ప్రజలకు భ్రమలు కల్పించినందుకు డాక్టర్ లక్ష్మణ్ ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పాలి.
బీజేపీ-టీఆర్ఎస్ కలిసి ఆడుతోన్న ఈ డబుల్ గేమ్‌ను విజ్ఞులైన తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. కమలం పువ్వు, గులాబీ పువ్వు కలిసికట్టుగా రాష్ట్ర ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టేందుకు చేసే ప్రయత్నాన్ని తిప్పికొట్టాలి.