– జనంతో పోటెత్తిన గజ్వేల్
– కదం తొక్కిన కాంగ్రెస్ శ్రేణులు
– దొరలను తరిమి కొట్టిన చరిత్ర తెలంగాణది
– రాబోయేది కాంగ్రెస్ సర్కార్..రేవంత్ భావోద్వేగం
– కేసీఆర్ అవినీతిపై వక్తల నిప్పులు
– తెలంగాణను అన్నివిధాలా నాశనం చేశాడు
తెలంగాణ అంటే పిడికెడు మట్టి కాదు కేసీఆర్.. తెలంగాణ అంటే దోపిడీ దార్లను మట్టుబెట్టిన గడ్డ.. తెలంగాణ రజాకార్లను పారదోలిన శౌర్యం. తెలంగాణ అంటే.. దొరా చాలు ఇక నీ పాలన అంటూ వందల మీటర్ల లోతున దొరతనాన్ని పాతిపెట్టిన వీరభూమి ఇది.. అంటూ లక్షల మంది సాక్షిగా పీసీసీ చీఫ్ రేవంత్ గర్జించారు. తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిన సెప్టెంబర్ 17న గజ్వేల్ కు లక్షలాదిగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులను చూస్తుంటే టీఆర్ఎస్ సర్కార్ ను సాగనంపటం ఖాయం.. తెలంగాణలో కాంగ్రెస్ మువ్వన్నెల జెండా రెపరెపలాడటం తథ్యమని జోస్యం చెప్పారు రేవంత్ రెడ్డి.
కేసీఆర్ ఇలాఖాలో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరాను సక్సెస్ చేసింది కాంగ్రెస్ పార్టీ. గజ్వేల్ గడ్డ హస్తం జెండాలతో నిండిపోయింది. ఇసుకేస్తే రాలనంతగా జనం తరలివచ్చారా అన్నట్లుగా కనిపించింది. ప్రతీ బూత్ నుండి కనీసం 9మంది అంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో కార్యకర్తలు కదిలారు. సభను విజయవంతం చేశారు. సభా ప్రాంగణం ప్రజలతో కిక్కిరిసిపోయింది. పార్కింగ్ ప్రాంతాలు పూర్తిగా నిండిపోయాయి. పోలీసులు సాయంత్రం 4గంటల నుండే గజ్వేల్ చుట్టూ ట్రాఫిక్ ను డైవర్ట్ చేశారంటేనే అర్థం చేసుకోవచ్చు జనం ఎంతలా తరలివచ్చారో. గజ్వేల్ కు 3 కిలోమీటర్ల ముందు నుండే పోలీసులు వాహనాలను మళ్లించారు. మధ్యాహ్నం 3గంటలకే సభ ఏర్పాటు చేసిన గ్రౌండ్ పూర్తిగా నిండిపోయింది. గజ్వేల్ రోడ్లన్నీ కాంగ్రెస్ జెండాలు, శ్రేణులతో నిండిపోయాయి.
కేసీఆర్ సర్కార్ ప్రాజెక్టుల అవినీతిపై, నిర్వాసితుల గోసను నిర్లక్ష్యం చేయటంపై, అన్నదాత ఉసురు పోసుకోవటంపై రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. మెదక్ జిల్లాకో ప్రత్యేకత ఉందన్నారు రేవంత్. ఇందిరమ్మను ఆదరించి పల్లకిలో మోసి పార్లమెంట్ కు పంపిన చరిత్ర ఉందని గుర్తుచేశారు. అందుకే ఆనాడు వేల కోట్ల రూపాయలతో 25 భారీ పరిశ్రమలు తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని చెప్పారు. ఇంతటి చరిత్ర ఉన్న మెదక్ జిల్లా… దేశంలో ఇందిరమ్మ రాజ్యం రావటానికి దోహదపడ్డ కాంగ్రెస్ జిల్లాను చేతులెక్కి మొక్కి అడుగుతున్నా.. తెలంగాణ ద్రోహులను తరిమికొట్టండి. ఢిల్లీకి వెళ్లి కాళ్లు మొక్కి, తర్వాత వెన్నుపోటు పొడిచిన కేసీఆర్ ను ఇక్కడి నుంచి తరిమి తరిమి కొట్టండి అని రేవంత్ భావోద్వేగానికి గురయ్యారు.
దమ్ముంటే గజ్వేల్ కు రమ్మని టీఆర్‌ఎస్ నేతలు సవాల్ విసిరారన్న రేవంత్.. ఇసుకేస్తే రాలనంతగా జనం వచ్చారని చెప్పారు. ఇంటెలిజెన్స్ అధికారులు ఇక్కడున్నవారి తలలు లెక్కపెట్టమని.. ఒక్క తల తక్కువ ఉన్నా మళ్లీ ఆరు నెలల్లో ఇదే గడ్డ మీద కదం తొక్కుతామన్నారు. అప్పుడు 5 లక్షల మంది వస్తాం.. కేసీఆర్ గుర్తు పెట్టుకో అని హెచ్చరించారు రేవంత్. కొండపోచమ్మ ప్రాజెక్టు కింద 14 గ్రామాలను నట్టేట ముంచారని.. ఆయా గ్రామాల ప్రజలకు నిలువ నీడ లేకుండా చేశారని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాదేనని.. రాష్ట్రం వచ్చాక కాంగ్రెస్ కు కేసీఆర్ వెన్నుపోటు పొడిచారని విమర్శించారు రేవంత్.
హరితహారం పేరుతో పోడు భూములను గుంజుకుంటున్నారని.. పీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వాలి, ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీని తక్షణమే రూ.5 లక్షలకు పెంచాలన్నారు. కేసీఆర్ వైద్యం చేయించుకునే కార్పొరేట్ ఆసుపత్రుల్లో పేదలందరికీ వైద్యం అందాలని.. కేసీఆర్ మనవడు తినే సన్న బియ్యం కాదు.. అతను చదివే స్కూల్ లో బడుగులు చదవాలని చెప్పారు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దేనన్న రేవంత్… 12శాతం రిజర్వేషన్లు చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చి ఏడేళ్లు దాటిందని… ఇప్పటివరకు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఇక ఎస్సీ, ఎస్టీలకు కేసీఆర్ రూ.లక్ష కోట్లు బకాయి పడ్డారని విమర్శించారు.
ఇక ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. ఏడున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ రూపొందించిన ఛార్జిషీట్ ను ఆయన విడుదల చేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, సీనియర్ నేతలు దామోదర రాజనర్సింహ, వి.హనుమంతరావు, గీతారెడ్డి, సీతక్క, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి, అద్దంకి దయాకర్ సహా పలువురు నేతలు సభలో పాల్గొని ప్రసంగించారు. కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
Advertisements