అనుముల రేవంత్‌రెడ్డి, లోక్‌సభ సభ్యుడు
ఆలయంలోనూ కేసీఆర్ దొరతనమా..
శతాబ్దాల చరిత్ర చూసినా ఏ పురాతన ఆలయాల్లోనూ.. వ్యక్తి ప్రాధాన్యంగా ఏ పాలకుల చిత్రాలనూ ఆలయంలో భాగంగా ఉండే స్తంభాలపై శిల్పాలుగా చెక్కలేదు. ఆలయాలపై అలనాటి చరిత్ర, సంస్కృతి, జీవన విధానాలను, ధర్మాలను శిల్పాలుగా చెక్కారు. కాని కోట్లాది మంది కొలిచే పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట ఆలయ అష్టభుజి ప్రాకార మండపంలోని రాతి స్తంభంపై సీఎం కేసీఆర్ చిత్రం, టీఆర్‌ఎస్ పార్టీ అధికారిక కారు గుర్తు చెక్కారు. ఈ ఆలయంలో రాతి స్తంభాలపై చారిత్రక సంస్కృతి, జీవన విధానాలను పొందుపర్చడంతో పాటుగా కేసీఆర్ బొమ్మ, టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారు బొమ్మ చెక్కడం దుర్మార్గం. ఈ చర్య ద్వారా కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతిస్తున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం విషయంలో రాజకీయాలకు చోటిచ్చి కోట్లాది మంది భక్తుల నమ్మకాలను, విశ్వాసాలను దెబ్బతీశారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయం విషయంలో రాజకీయాలకు చోటిచ్చి కోట్లాది మంది భక్తుల నమ్మకాలను, విశ్వాసాలను దెబ్బతీశారు.
ఏ లక్ష్యం కోసం తెలంగాణ కోసం పోరాటం జరిగిందో ఆ లక్ష్యాన్ని విస్మరించారు. వ్యక్తి పూజకోసం, వ్యక్తిగత ప్రతిష్టకోసం వ్యవస్థలను దెబ్బతీస్తున్న కేసీఆర్ నియంతృత్వానికి ఇది పరాకాష్ఠ. వందలాదిమంది యువకుల ఆత్మ బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ప్రస్తుతం కలియుగ రాచరికం రాజ్యమేలుతోంది. నిన్నటివరకు పొగడ్తలు, నాయకుడి భజన, వ్యక్తి పూజలతో సరిపెట్టిన టీఆర్ఎస్ శ్రేణులు, కొందరు ప్రభుత్వ ముఖ్యుల పిచ్చి నేడు పరాకాష్టకు చేరింది. అహంకారంతో వ్యవహరిస్తూ… దేవుడి సన్నిధిని కూడా అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చింది. ఇది కచ్చితంగా భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే.
ప్రజాశ్రేయస్సే పరమావధిగా అద్భుతమైన పాలన అందించిన శాతవాహనులు, ఆర్యులు, రాయలు, చాళక్యులు లాంటి చారిత్రక నేపథ్యం ఉన్న వారి హయాంలోనూ ఆలయాల్లో ఇలాంటి చర్యలు జరగలేదు. దేవుడిని కొలవడం, విశ్వాసాలను కాపాడడం, నమ్మకాలను నిలబెట్టడం, సంస్కృతి – సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రాథామ్యాలుగా ఉండేవే తప్ప.. ఏ గుడిపైనా రాజుల ప్రతిమలు, ఫొటోలు లేవు. కానీ నేడు కేసీఆర్ ప్రతిమలు పెట్టడం ద్వారా రాజకీయలకు చోటిచ్చారు.
గత ఐదేళ్లుగా కేసీఆర్ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నాం. కేసీఆర్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను కలుపుకొని ఉద్యమాలు చేస్తున్నాం. ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్‌కు అధికారం ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నియంతృత్వ విధానాలను అనుసరిస్తున్నారు. అధికారం శాశ్వతం కాదు.. ఆ విషయం మర్చిపోయి కేసీఆర్ కలియుగ రాచరికాన్ని అమలుచేస్తున్నారు. ప్రజాస్వామ్యవాదులు, మత విశ్వాసాలు గౌరవించేవారు ఆలోచన చేయాలి. తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఈ ఘటనపై తక్షణ విచారణ జరగాలి. ప్రభుత్వ ఆదేశాలతో జరిగిందా లేక అత్యుత్సాహంతో జరుగుతున్నదా అనేది తేలాలి. ఆగమ శాస్త్ర సలహదారులెవరైనా ఇలా సూచించారా.. వారి దృష్టిలో ఈ విషయం ఉందా అనేది కూడా చెప్పాలి. ప్రభుత్వ ఆదేశాలతో జరిగితే.. ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయాలి. లేకుంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ప్రభుత్వం దిగి వచ్చేవరకు ఆందోళనలకు సిద్ధం.