తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కవరేజీ విషయంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా వ్యవహరిస్తున్న తీరును ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్‌ను చంపడానికి మీడియా సుపారీ తీసుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బులు తీసుకొని హత్యలు చేసే విధంగా మీడియా తయారైందన్న ఆయన.. మీడియా చంపాలనుకుంటున్నది కేవలం కాంగ్రెస్ పార్టీని మాత్రమే కాదని..తద్వారా ప్రజాస్వామ్యాన్ని కూడా అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. టీఆర్ఎస్, బీజేపీల్లాగా తాము మీడియాకు ప్యాకేజీలు ఇవ్వలేకపోయామని.. కాంగ్రెస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం కచ్చితంగా మీడియానే అని విమర్శించారు
తెలంగాణలో ప్రతి రాజకియ పార్టీ సొంతంగా ఒక ఛానెల్ పెట్టాల్సిన పరిస్థితిని ప్రస్తుత మీడియా సృష్టిస్తోందని.. కానీ అదే జరిగితే ప్రజా స్వామ్యం మీద నమ్మకం పోతుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మీడియా తీరు తమ పార్టీ కార్యకర్తలను తీవ్రంగా గాయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర పార్టీల్లా విద్వేషాలు రెచ్చగొట్టకుండా.. ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేయడమే తాము చేసిన తప్పా అని ఆయన ప్రశ్నించారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా విపరీత పోకడలతో ప్రజాస్వామ్యం ఘోరంగా దెబ్బతింటోందని ఆరోపించారు. సరైన విశ్లేషణలతో ప్రతిపక్ష పార్టీకి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.