కీచక రాఘవ ఎక్కడ అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి ట్విట్టర్ లో తెలంగాణ ప్రభుత్వానికి ప్రశ్నల వర్షం కురిపించారు. భద్రాద్రి పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవను ఇంత వరకు అరెస్ట్ చేయకపోవడంపై పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సభ్యసమాజం తల దించుకునే ఘటన జరిగితే స్పష్టమైన ఆధారాలు ఉన్నా.. రాఘవను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతుంది.
ఈ విషయంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, పోలీసుల అలసత్వాన్ని ట్విట్టర్ లో కడిగేశారు. కీచక రాఘవ ఎక్కడ..? ప్రగతిభవన్‌లోనా..? ఫామ్‌హౌస్‌లోనా? అని ట్వీట్ చేశారు. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నించే వారిని నిమిషాల్లో అరెస్ట్ చేసే పోలీసులు.. మానవమృగాన్ని రోజుల తరబడి పట్టుకోలేకపోవడమేంటని ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ దుర్మార్గుడిని కాపాడుతున్న అదృష్య శక్తి ఎవరు..? ఈ దారుణ ఘటనపై టీఆర్ఎస్ పెద్దల మౌనానికి అర్థమేంటి? అంటూ రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు.
నిన్న వనమా రాఘవను అరెస్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఆ వార్తలను పోలీసులు ఖండించారు. రాఘవను చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని కొత్తగూడెం పోలీసులు చెప్పారు. అతని కోసం తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది బృందాలు గాలిస్తున్నాయని అన్నారు. సరైన ఆధారాలు లభిస్తే రాఘవపై రౌడీషీట్ నమోదు చేస్తామని తెలిపారు.
రామకృష్ణ సూసైడ్ నోట్, వీడియో ఆధారంగా కేసు నమోదు చేశామని పోలీసులు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. రాఘవపై 302, 306, 307 సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు ఎస్పీ కార్యాలయం తెలిపింది. పరారీలో ఉన్న రాఘవని త్వరలోనే పట్టుకుని కోర్టులో హాజరుపరుస్తామని ప్రకటించారు. మరోవైపు ఈ ఘటనను నిరసిస్తూ.. కొత్తగూడెంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బంద్ జరుగుతుంది. కాంగ్రెస్ పిలుపునిచ్చిన ఈ బంద్ కి ప్రజాసంఘాలు, వామపక్షాలు మద్దతు ప్రకటించాయి.