రాష్ట్రంలో కేవలం 80వేల ఉద్యోగాలు మాత్రమే ఖాళీ ఉన్నాయని కేసీఆర్ చెప్పడం పచ్చి అబద్దమన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మల్కాజ్ గిరిలో పార్టీ డిజిటల్ మెంబర్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తూ.. కేసీఆర్ ఉద్యోగాల ప్రకటనపై మాట్లాడారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళే నోటిఫికేషన్ ఇచ్చేవారని అన్నారు. 2014లో లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కేసీఆర్ ప్రకటనను గుర్తు చేశారు.
80వేల ఉద్యోగాలే ఉంటే.. మిగిలినవి ఏమయ్యాయని ప్రశ్నించారు. బిస్వాల్ కమిటీ సైతం 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని నివేదిక ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఉద్యోగాలు అడగటం కాదు.. కేసీఆర్ ఉద్యోగం పీకేయాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు రేవంత్. ముఖ్యమంత్రి ఉద్యోగం ఊడే పరిస్థితి వచ్చినందునే ఈ ప్రకటన చేశారని విమర్శించారు.
కాంగ్రెస్ భయంతోనే కేసీఆర్ హడావిడిగా ఉద్యోగ ప్రకటన చేశారన్నారు రేవంత్. నిరుద్యోగుల పక్షాన నోటిఫికేషన్ల కోసం అసెంబ్లీ, సచివాలయం, ప్రగతి భవన్ లను యూత్ కాంగ్రెస్ ముట్టడించడంతోనే సీఎం దిగొచ్చారని చెప్పారు. ప్రకటన చేస్తే సరిపోదని.. నియామకపత్రాలు ఇచ్చినప్పుడే కేసీఆర్ హామీ నెరవేర్చినట్లు అవుతుందని చెప్పారు.
నిరుద్యోగులను అసెంబ్లీ సాక్షిగా మరోసారి సీఎం వచించారన్న రేవంత్.. కేసీఆర్ ను ఉద్యోగాలు అడగాల్సిన అవసరం లేదన్నారు. మరో 12 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. వెంటనే 2 లక్షల నోటిఫికేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు.