ప్రభుత్వ అవినీతిని ఎండగడుతూ, అభివృద్ధిపై నేతల నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. తాజాగా అంబర్‌పేట్ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జావెద్ అహ్మద్ తరపున ప్రచారం నిర్వహించిన రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తూర్పారబట్టారు.
2004 నుంచి 2018 వరకు 14 ఏళ్లు అంబర్‌పేట్ ఎమ్మెల్యేగా, రెండేళ్లుగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి అంబర్‌పేట అభివృద్ధికి ఏం చేశారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఏడేళ్లుగా సీఎంగా కేసీఆర్, మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ ఉండి స్థానిక సమస్యల్లో వేటిని తీర్చారో చెప్పాలని నిలదీశారు. ఇన్నేళ్లలో ఏం చేయని వారు.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచినా ఏం చేయలేరు అని ఎద్దేవా చేశారు.
కొత్త ఇల్లు మొదలుపెడితే చాలు.. గుంతకు ఎంతిస్తవు, పిల్లర్‌కు ఎంతిస్తవు అని టీఆర్ఎస్ కార్పొరేటర్లు వసూలు చేసింది నిజం కాదా అని రేవంత్ ప్రశ్నించారు. అల్లుడొస్తే కాళ్లు చాపుకోవడానికి కూడా ఇళ్లల్లో స్థలం లేదని .. అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్న కేసీఆర్… ఇప్పిస్తామని మైనార్టీ ఓటర్లను మభ్యపెట్టిన ఓవైసీ సోదరులు ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోలేదని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే కాంగ్రెస్ అభ్యర్థిలనుగెలిపించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.