ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్‌లో భారత్‌కు బంగారు పతకం సాధించి పెట్టిన నిఖత్ జరీన్‌కు టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి బహుమానం ప్రకటించారు. ఇస్తాంబుల్ వేదికగా జరిగిన చాంపియన్ షిప్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించిన నిఖత్ ను అభినందించారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆడబిడ్డ నిఖత్ జరీన్ కు రూ.5 లక్షలు ఇస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందూరు నుంచి ఇస్తాంబుల్ వరకు ఆమె ప్రయాణం ఎందరికో స్ఫూర్తినిస్తుందని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.
ఈ క్రమంలోనే తెలంగాణ సర్కారు గతంలో పీవీ సింధు, సైనా, సానియా మీర్జాలకు నజరానా ఇచ్చినట్లుగానే నిఖత్ జరీన్‌కు ఇవ్వాలని రేవంత్ డిమాండ్ చేశారు. తెలంగాణ నుంచి వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ గా నిలిచిన తొలి క్రీడాకారిణిగా నిఖత్ జరీన్ చరిత్రకెక్కింది.
ఇండియా నుంచి ఈ ఘనత సాధించిన..మేరీ కోమ్, సరితా దేవిల సరసన నిఖత్ చేరింది. తెలంగాణ బిడ్డ..భారత్ తరఫున ఆడి తన పంచ్ పవర్‌తో భారత మువ్వన్నెల జెండాను ప్రపంచ వేదికపై రెప రెప లాడించింది. నిఖత్ జరీన్ యువతీ యువకులందరికీ ఆదర్శమని ఈ సందర్భంగా రేవంత్ పేర్కొన్నారు.