టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన ‘హాథ్ సే హాథ్’జోడో యాత్ర మహబూబాబాద్ జిల్లాలో కొనసాగుతుంది. ఈ యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డిని నర్సింహులు పేట మండల వీఆర్ఏలు కలిశారు.
వీఆర్ఏల పే స్కేల్, ప్రమోషన్స్ పై అసెంబ్లీలో ప్రస్తావించి సమస్యను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. 2017 నుంచి వీఆర్ఏలకు పే స్కేల్ ఇస్తామని కేసీఆర్ హామీ ఇస్తూ వస్తున్నారన్నారు. కానీ ఇప్పటివరకూ ఆ హామీ నెరవేర్చలేదని తెలిపారు.
2022జులైలో నిరవధిక సమ్మె చేసిన సమయంలో కేటీఆర్ కూడా నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడు ఎన్నికల తరువాత పే స్కేల్ ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదన్న వీఆర్ఏలు రేవంత్ రెడ్డికి తెలిపారు.
అనంతరం రేవంత్ రెడ్డి నాగారం సమీపంలోని గోప తండాలో మిర్చి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మిర్చి సాగులో సమస్యలను రేవంత్ కి బానోత్ లక్ష్మీ అనే మహిళ వివరించింది. క్వింటాకు రూ.22 వేలు గిట్టుబాటు ధర కల్పించేలా చూడాలని వినతి పత్రం అందజేశారు.