ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్ చేసే ప్రజా ఉద్యమాన్ని టీఆర్ఎస్ అడ్డుకునే కుట్ర చేస్తోందని మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. టీపీసీసీ కార్యవర్గం, డీసీసీ అధ్యక్షులతో ఆయన జూమ్ సమావేశం నిర్వహించారు. ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటాలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, విద్యుత్ చార్జీలు తగ్గే వరకు పోరాడుతుందన్నారు.
రైతులు పండించిన పంట చివరి గింజ కొనే వరకు కాంగ్రెస్ విశ్రమించబోదని స్పష్టం చేశారు రేవంత్. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ భరోసా కల్పించాలని… తమ పక్షాన పోరాటం చేస్తుందని వారు విశ్వసించేలా చేయాలని పార్టీ నాయకులకు సూచించారు. ఐదు అంశాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తగ్గి చార్జీలు తగ్గించే వరకు పోరాటాలు జరగాలన్న రేవంత్.. రైతులకు భరోసా వచ్చే వరకు ప్రతి వరి గింజ కొనేవరకు ఉద్యమాలు సాగాలన్నారు.
కేంద్రం, రాష్ట్రం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రైతులకు నష్టం చేసే పరిస్థితికి తీసుకొచ్చారని విమర్శించారు రేవంత్. బియ్యం పేరుతో ఒకరిపై ఒకరు ప్రకటనలు చేసుకుంటూ ఇష్యూను పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఏ బియ్యం అయినా కొనండి కానీ.. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పోరాటం సాగాలన్నారు. గురువారం విద్యుత్ సౌథ, సివిల్ సప్లై కార్యాలయాల ముట్టడి పెద్దఎత్తున జరగాలని చెప్పారు.
నిరసన కార్యక్రమాల్లో ప్రతీ నాయకుడు పాల్గొనాలని స్పష్టం చేశారు రేవంత్. టీఆర్‌ఎస్ నేతలు ఎక్కడన్నా అడ్డుకుంటే అక్కడే రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయాలని సూచించారు. ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేస్తే.. అక్కడే ఉద్యమం కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ నెలాఖరున వరంగల్ లో జరిగే సమావేశానికి రాహుల్ గాంధీ రావాలని ప్రతిపాదన పెట్టామని.. ఆయన వచ్చినప్పుడు డీసీసీ అధ్యక్షులతో మాట్లాడతారని తెలిపారు రేవంత్. ఈ సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, గీతారెడ్డి, అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, మధు యాష్కీ సహా పలువురు నేతలు పాల్గొన్నారు.