ఉప ఎన్నిక ఉంటేనే కొత్త పథకం వస్తోంది.. రాష్ట్రమంతా ఉప ఎన్నికలు వస్తే బాగుండని అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డిని కలిశారాయన. కాంగ్రెస్ చేపట్టిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ గురించి చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్.. ఇంద్రవెల్లి సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులు, ఆదివాసీలు, దళితులను కోరారు.
సోమవారం నుంచి సెప్టెంబర్ 17 వరకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు రేవంత్. ఇస్తవా.. చస్తవా అనే నినాదంతో పోరాటం చేస్తామని వివరించారు. రాష్ట్రంలోని ప్రతీ దళిత, గిరిజన, ఆదివాసీలకు రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ మొదటి వారంలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమానికి రాహుల్ గాంధీ వస్తారని చెప్పారు.
రాష్ట్రంలో మరో నాలుగు, ఐదు ప్రాంతాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు చెప్పారు రేవంత్. ఇంద్రవెల్లి సభతో ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతందని భావిస్తున్నట్టు తెలిపారు. ముమ్మాటికీ హుజూరాబాద్ ఉప ఎన్నికలో లబ్ధి పొందాలనే దళిత బంధు పథకాన్ని కేసీఆర్ తెచ్చారని ఆరోపించారు రేవంత్ రెడ్డి.